Narsapur : రాజ్యాగంతోనే దేశంలో పేదలకు బలమైన శక్తి వచ్చింది – రాహుల్

ప్రధాని మోడీ , అమిత్ షా, RSS రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని, రాజ్యాంగంతోనే దేశంలో పేదలకు బలమైన శక్తి వచ్చిందని , రాజ్యాంగం అనే పుస్తకం మాములు పుస్తకం కాదని, మహా మహా మేధావులు ఏళ్ల తరబడి కృషి చేసి దేశానికి రాజ్యాంగం అందించారని రాహుల్ చెప్పుకొచ్చారు

  • Written By:
  • Publish Date - May 9, 2024 / 06:22 PM IST

తెలంగాణ (Telangana) లో లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారానికి తెరపడే సమయం వచ్చింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని స్పీడ్ చేసాయి. చివర్లో ఇచ్చే స్పీచ్ జనాల్లోకి బాగా వెళ్తుందని..భావించిన పార్టీలు తమ స్పీచ్ లతో ప్రత్యర్థి పార్టీలను ఇరకాటంలో పడేసేందుకు పక్క స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..ఈ లోక్ సభ ఎన్నికల్లో కనీసం 14 సీట్లు సాధించాలని చూస్తుంది. దానికి తగ్గట్లే ప్రజలను ఆకర్షిస్తూ ప్రచారం చేస్తూ వస్తుంది. ఈరోజు రాహుల్ గాంధీ (Rahul Gandhi) సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నర్సాపూర్ లో ఏర్పాటు చేసిన జన జాతర సభలో పాల్గొన్న ఆయన..బిజెపి ఫై నిప్పులు చెరిగారు.

We’re now on WhatsApp. Click to Join.

అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని బిజెపి కుట్ర చేస్తుందని మొదటి నుండి ఆరోపిస్తూ వస్తున్న రాహుల్..ఈరోజు కూడా అలాగే ఆరోపణలు చేసారు. ప్రధాని మోడీ , అమిత్ షా, RSS రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని, రాజ్యాంగంతోనే దేశంలో పేదలకు బలమైన శక్తి వచ్చిందని , రాజ్యాంగం అనే పుస్తకం మాములు పుస్తకం కాదని, మహా మహా మేధావులు ఏళ్ల తరబడి కృషి చేసి దేశానికి రాజ్యాంగం అందించారని రాహుల్ చెప్పుకొచ్చారు. రాజ్యాంగం ద్వారానే విద్య, ఉద్యోగాలు, ఓటుహక్కు అన్నీ మనకు వచ్చాయని అలాంటి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. అంతే కాదు రిజర్వేషన్లు సైతం రద్దు చేసేందుకే ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి విక్రయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించి అన్నీ ప్రైవేటుపరం చేస్తున్నారని, క్రమంగా ప్రైవేటీకరణ పెంచి రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ ఆలోచన అని పేర్కొన్నారు.

గత పదేళ్లలో మోడీ విమానాశ్రయాలు, పోర్టులు, భారీ పరిశ్రమలను విక్రయించారని … కేవలం 2శాతం ఉన్న బిలియనీర్ల చేతిలోకి దేశ సంపదను దోచిపెట్టారని రాహుల్ ఆరోపించారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతగా ప్రైవేటును ప్రోత్సహించలేదని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోని నిరుపేదలందరితో ఒక జాబితా రూపొందిస్తామని, రైతులు దళితులు ఆదివాసీలు, మైనార్టీలతో ఒక జాబితా రూపొందిస్తామన్నారు. ప్రతి పేద కుటుంబం నుంచి ఒక మహిళను ఎంపిక చేసి రూ.లక్ష ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళ బ్యాంకు ఖాతాలో రూ.లక్ష డిపాజిట్‌ చేస్తామని , కుటుంబ ఖర్చుల కోసం ప్రతి పేద మహిళ బ్యాంకు ఖాతాల్లో నెలకు రూ.8500 వేస్తామని పేర్కొన్నారు. వస్తువుల ఉత్పత్తి కోసం భారతీయ పరిశ్రమలను ప్రోత్సహిస్తామని, పరిశ్రమలను ప్రోత్సహిస్తే దేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

Read Also : Nagari : మూడు రోజుల్లో పోలింగ్..అయినాగానీ రోజా తీరు మారలేదు..