ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో కాంగ్రెస్ పార్టీ (Congress Party) వరుస సభలతో కార్యకర్తల్లో జోష్ నింపుతూ..ప్రజలను ఆకట్టుకుంది. తెలంగాణ లో అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ హామీలను (Congress 6 Guarantee Schemes) అమలు చేస్తామంటూ..హామీలను ప్రజలకు వివరిస్తూ..బిఆర్ఎస్ ఫై విమర్శలు సంధిస్తూ వస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు జాతీయ నేతలు సైతం ప్రచారంలో పాల్గొంటూ ప్రజల్లో నమ్మకం పెంచుతున్నారు.
ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ (Kollapur)లో కాంగ్రెస్ పార్టీ ప్రజాభేరి సభ (Congress Praja Bheri Sabha) నిర్వహించింది. ఈ సభలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాల్గొన్నారు. వాస్తవానికి ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరు కావాల్సి ఉండగా..ఆమె అనారోగ్యంతో బాధపడుతుండడం తో రాహుల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తన సోదరి ప్రియాంక గాంధీ అనారోగ్యం దృష్ట్యా తాను వచ్చానని చెప్పారు. మనది రాజకీయ అనుబంధం కాదని, కుటుంబ అనుబంధమన్నారు. పథకాలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రైతుబంధు నిలిచిపోతుందని ఆరోపణలు చేస్తున్నారని, అలాంటిదేమీ జరగదన్నారు. పైగా తమ ప్రభుత్వం వస్తే రైతు భరోసా కింద రూ.15వేలు ఇస్తామని , ఉపాధి హామీ కూలీలకు రూ.12వేలు ఇచ్చి ఆదుకుంటామన్నారు.
అలాగే ధరణి ఫై కూడా రాహుల్ మండిపడ్డారు. ధరణి పేరుతో భూముల్ని లాగేసుకునే కుట్ర జరుగుతోంది. ధరణితో లాభం జరిగింది కేవలం కల్వకుంట్ల కుటుంబానికే. ప్రభుత్వ సంస్థలు అన్ని నిర్వీర్యం చేశారు. రాష్ట్ర ప్రజల ధనం పూర్తిగా కల్వకుంట్ల కుటుంబానికే వెళ్తోంది. వారి చేతుల్లోనే రెవెన్యూ, ఎక్సైజ్ లాంటి శాఖలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు కలలు కన్నది దొరల తెలంగాణ కోసం కాదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో నీటి ప్రాజెక్టులను నిర్మించింది. నాగార్జున సాగర్, శ్రీరాం సాగర్, సింగూర్ ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు రాహుల్.
We’re now on WhatsApp. Click to Join.
ఈ రాష్ట్రానికి వెన్నెముకగా మహిళలు ఉన్నారు. రైతు భరోసా అనే కార్యక్రమంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తోంది. రూ.15 వేలు ప్రతి ఏడాదికి, కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5 లక్షల రూపాయలు ఇస్తాం. గ్రుహ జ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు కరెంటు కాల్చే కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తాం. చేయూత పథకం కింద పింఛన్లు రూ.4 వేలు చేయబోతున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తాం అన్నారు. దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి తెలంగాణ సొమ్మును దోచేశారన్నారు. లక్షల కోట్ల సొమ్మును పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు.
మీరు ఎంఐఎంకి ఓటేసినా, బీఆర్ఎస్ ఓటేసినా వేస్ట్. బీజేపీకి ఓటేసినా పరోక్షంగా బీఆర్ఎస్‌కి ఓటేసినట్లే. ఇక్కడ బీఆర్ఎస్ ను పడగొట్టడమే కాకుండా, 2024లో బీజేపీని రానివ్వకుండా అడ్డుకుంటాం. తెలంగాణ ప్రజలు స్పష్టతతోనే ఉన్నారు. ఈ రోజు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి. మన బంధం రాజకీయ బంధం మాత్రమే కాదు. కుటుంబ బంధం. చరిత్రలో ఇందిరా గాంధీకి తెలంగాణ ప్రజలు అండగా నిలబడ్డారు. ఈ విషయాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను. మీరందరూ తెలంగాణ కోసం పోరాడితే, సోనియా గాంధీ చారిత్రక నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని మంజూరు చేశారు’’ అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.
Read Also : KCR : ఉత్తమ్ గడ్డం గీసుకుంటే ఎంత గీసుకోకపోతే ఎంత ..హుజూర్‌నగర్ సభలో కేసీఆర్ నిప్పులు
