డ్రగ్స్ కేసు వెనుక ఏం జరిగింది? నాలుగేళ్ల తరువాత సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇవ్వడంలో మతలబు ఏంటి? ఈడీ విచారణ జరుగుతున్న సమయంలోనే క్లీన్ చిట్ ఇవ్వడం దేనికి సంకేతం? సినీ హీరోలు, నటులకు విచారణ రూపంలో జరిగిన డామేజ్ ను ఎవరు తిరిగి ఇస్తారు? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి. పలు రకాల అనుమానాలు, సందేహాలు, ఆరోపణలు, విమర్శలకు డ్రగ్స్ విచారణ కేంద్ర బిందువు అయింది. కానీ, తెలంగాణ ఎక్సైజ్ ఆధ్వర్యంలోని సిట్ మాత్రం సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్ చార్మి, హీరో రవితేజ తదితరులకు క్లీన్ చిట్ ఇచ్చింది. వాళ్ల నుంచి సేకరించిన నమూనాల్లో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లేవని తేల్చేసింది. ఫోరెన్సిక్ ఇచ్చిన నివేదిక ఆధారంగా క్లీన్ చిట్ ఇచ్చినట్టు సిట్ చెబుతోంది.
2017లో డ్రగ్స్ కేసు విచారణను తెలంగాణ ఎక్సైజ్ శాఖ చేపట్టింది. తెలుగు సినిమా పరిశ్రమలోని దాదాపు 60 మందిని విచారించింది. వాళ్లలో 16 మందికి సంబంధాలు ఉన్నట్టు గుర్తించి విచారణ చేసింది. వెంట్రుకలు, గోళ్ల నమూనాలను సేకరించింది.ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా డ్రగ్స్ కేసు మూలాలను నిర్థారిస్తారని అనుకున్నారు. ఆనాడు అకున్ సబర్వాల్ ఎక్సైజ్ శాఖ ఎండీ ఉన్నప్పుడు కేసు విచారణ వేగంగా జరిగింది. ఆయన బదిలీ తరువాత కేసు దాదాపు బుట్టదాఖలు అయింది.
తాజాగా బొంబాయి హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య తరువాత డగ్స్ కోణాలు అనేకం బయటకు వచ్చాయి. బెంగుళూరు, ముంబాయి పోలీసుల విచారణలో హైదరాబాద్ మూలాలు ఉన్నట్టు గుర్తించారు. రకుల్‌ప్రీత్ సింగ్ వాగ్మూలం ఆధారంగా హైదరాబాద్ మూలాలు బయటపడ్డాయి. డగ్స్ రూపంలో హవాల జరిగిందని నిఘా సంస్థలు ఆరా తీశాయి. ఈడీ రంగంలోకి దిగింది. డగ్స్. కేసులో ఉన్న ప్రధాన నిందితుడు కెల్విన్ తో పాటు సినీ హీరోలు,నటులను ఈడీ విచారణకు పిలిచింది.ఆ విచారణ జరుగుతోన్న సమయంలోనే తెలంగాణ సిట్ క్లీన్‌చిట్ ఇచ్చేసింది.
ఇక ఈడీ విచారణకు బ్రేక్ పడినట్టేనని తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ వచ్చింది కాబట్టి ఇక మనీ లాండరింగ్ అనేమాట ఉండదు. మరోసారి డ్రగ్స్ కేసుతో మనీ లాండరింగ్ విచారణ అటకెక్కినట్టే భావించొచ్చు. దీని వెనుక పెద్ద రాజకీయ లాబీయింగ్ జరిగినట్టు గుసగుసలు. పైగా రాజకీయ రంగుకూడా బాగా పులుముకుంది. కేటీఆర్‌కురేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ ను విసరడంతో డ్రగ్స్ కేసుకు రాజకీయ మత్తు ఎంత ఉందో అర్థం అయింది.