Site icon HashtagU Telugu

BRS Government : బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూల, ప్రతికూల అంశాలు

Pros And Cons Of Brs Govt

Pros And Cons Of Brs Govt

Pros and Cons of BRS Government : ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. 30వ తేదీన తెలంగాణలో పోలింగ్. ప్రచారం 28వ తేదీకి ముగుస్తుంది. అంటే రాజకీయ పార్టీలు గట్టిగా ప్రచారం చేసుకోవడానికి కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలాయి. ఇక ఇప్పుడు పార్టీలు తమ పథకాలను, వ్యూహాలను ప్రచారం చేసుకోవడం కంటే, ఏయే ప్రాంతాల్లో ఏయే నియోజకవర్గాల్లో ఏయే సామాజిక వర్గాల్లో ఎవరి పట్ల ఎలాంటి సానుకూలత, ప్రతికూలత చోటుచేసుకున్నాయో గ్రౌండ్ రిపోర్టు సేకరించే పనిని చేస్తున్నాయి. బహిరంగ సభలు, ఒకరిపై ఒకరు ఆరోపణలు, సవాళ్లు ప్రతి సవాళ్లు ఇవన్నీ సరే సరి. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS Party)కి అనుకూలిస్తున్న అంశాలు ఏమిటి, ప్రతికూలంగా ఉన్న అంశాలు ఏంటి అనే విషయం పెద్ద చర్చగా మారింది.

నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ సాగునీరు, తాగునీరు అందించడంలో, 24 గంటలు కరెంటు అందుబాటులో ఉంచడంలో బీఆర్ఎస్  ప్రభుత్వం (BRS Government) సఫలీకృతమైంది. అలాగే రైతుబంధు దళిత బంధు లాంటి కొన్ని పథకాలు కూడా అధికార పార్టీకి అనుకూలమైన అంశాలుగానే కనిపిస్తున్నాయి. అన్నిటికంటే తెలంగాణ సెంటిమెంట్ ని ప్రేరేపించి తెలంగాణ స్వయం పరిపాలనలో తన సత్తా చాటుకునే దిశగా రాష్ట్రాన్ని నడిపించడంలో అధికార పార్టీ కి కొన్ని ప్లస్ పాయింట్లు లభిస్తాయి.

We’re Now on WhatsApp. Click to Join.

BRS ప్రభుత్వానికి ప్రతికూల అంశాలు:

ప్రభుత్వానికి అనుకూలిస్తున్న అంశాల కంటే ప్రతికూలమైన అంశాలే ఎక్కువగా ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత అత్యంత నిరాశా నిస్పృహలలో ఉంది. ‌‌ పెద్దలకు రెండు మూడు వేలు పెన్షన్ కంటే పిల్లలకు ఉద్యోగాలు కల్పించడమే సరైన విధానమని పెద్దలందరూ భావిస్తున్నారు. యువత ఆగ్రహంలో రగిలిపోతోంది. ఇప్పటికే నిరుద్యోగ యువజనం ప్రభంజనంలా బస్సు యాత్రలు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పెద్దలను వేడుకుంటున్నారు. మాకు పెన్షన్ వద్దు మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమని యువత చెబుతోంది. అలాగే రైతుబంధు విషయంలో కొంత సానుకూలతో ఉన్నప్పటికీ రుణమాఫీ విషయంలో రైతులు వ్యతిరేకతతో ఉన్నట్టు తెలుస్తుంది. తమ రుణాల మీద వడ్డీని మాఫీ చేశారు కానీ రుణాన్ని మాఫీ చేయలేదని, లక్ష రూపాయల రుణం మాఫీ చేసినా రైతుబంధు కంటే ఎక్కువగా ఉపయోగపడుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. దళిత బంతులాంటి పథకాలు పార్టీ కార్యకర్తలకే దక్కాయని, డబల్ బెడ్ రూమ్ లాంటి పథకాలు కూడా పార్టీ కార్యకర్తలకు కొందరికే అందాయన్న విమర్శ నలుదిశలా కమ్ముకుంటోంది. అలాగే ఆంధ్రా సెటిలర్లు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పోటీ పెట్టకుండా తమ అభిమానులను సానుభూతిపరులను వారి మనోభీష్టానికి అనుకూలంగా ఓటు వేయడానికి పార్టీ వదిలేసింది. వీరి ఓటు బ్యాంకు చీల్చడానికి బిజెపి పవన్ కళ్యాణ్ ద్వారా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ టిడిపి వర్గాలు, వారి మద్దతుదారులు అంతా కాంగ్రెస్కు అనుకూలంగా పనిచేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది కూడా ప్రభుత్వానికి చాలా ప్రతికూలంగా పరిణమించిన్నట్టు తెలుస్తోంది.

మరోపక్క బిజెపి (BJP), బీఆర్ఎస్ (BRS) ఒకటి అని జరుగుతున్న ప్రచారం ప్రజలను కన్విను చేసినట్టుగా అనేక వార్తల ద్వారా అర్థమవుతుంది. ఈ ప్రచారంతో ముస్లిం సామాజిక వర్గ ఓటర్లు కూడా బీఆర్ఎస్ కు ఓటు వేయకుండా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. గతం ఎన్నికల మాదిరిగా ఇప్పుడు తెలంగాణ సెంటిమెంటు లేదు. ఆ సెంటిమెంట్ ని రెచ్చగొట్టడానికి అధికార పార్టీ వారికి ఏ ఒక్క చిన్న అంశం కూడా కనిపించడం లేదు. ఆంధ్రా ఓటర్లను బుజ్జగించడం తప్ప సెంటిమెంట్ రెచ్చగొడితే లాభం లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అర్థం చేసుకున్నారు. అందుకే గతంలో చంద్రబాబు నాయుడు పట్ల శతృ భావాన్ని ప్రదర్శించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఆయన మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే మేడిగడ్డ పిల్లర్లు కూలిపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంగానే ఒక ప్రశ్న చిహ్నంగా మారిపోవడం ప్రభుత్వానికి పెద్ద ప్రతికూల అంశంగా మారిపోయింది. కాంగ్రెస్ వారు అధికారంలోకొస్తే పథకాలు అమలు చేయరని, మళ్లీ చీకటి రోజులు దాపురిస్తాయని, దోపిడీలు, దుర్మార్గాలు మతకలహాలు పెరిగిపోతాయని అధికార పార్టీ చేస్తున్న ప్రచారాన్ని కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో చేసిన పథకాల హామీ అమలు జరుగుతున్న తీరు ప్రత్యక్షంగా కనబడుతుంది. సందేహం ఉన్నవారు కర్ణాటక వచ్చి చూసుకోండని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆహ్వానిస్తున్నారు కూడా. కాంగ్రెస్ పార్టీ పథకాలు కర్ణాటకలో అమలు జరగడం లేదని పెద్దపెద్ద ప్రకటనలు ఇస్తూ ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఆహ్వానం మీద స్పందించడం లేదు.

అన్నిటికంటే మించి కుటుంబ పాలన అనే అంశం కేసీఆర్ ప్రభుత్వం మెడకు పెద్ద గుదిబండలా మారింది. ఒక కుటుంబమే తెలంగాణను సాధించలేదు, వేలమంది బలిదానాలతో తెలంగాణ వచ్చింది. కానీ బాగు పడింది మాత్రం ఒక్క కుటుంబమే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వీటికి తోడు తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి తెచ్చామని చెప్పుకుంటున్న వారికి పదేళ్లు అధికారం ఇచ్చామని, అలాగే రాష్ట్రాన్ని ఇచ్చిన వారికి కూడా ఒక అవకాశాన్ని ఇద్దామని ప్రజల్లో అభిప్రాయం రోజు రోజుకీ బలపడుతున్న వార్తలు కూడా వినవస్తున్నాయి. దీన్ని ప్రజలు నమ్మితే అది ప్రతికూలంగా పరిణమిస్తే, అది బీఆర్ఎస్ పార్టీకి ప్రాణాంతకంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం మీద ఈ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి అనుకూలించే అంశాల కంటే, ప్రతికూలమైన అంశాలే ప్రజల్లో బలమైన వ్యతిరేక పవనాలు వీయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా అన్న సందేహాలు మాత్రం ఎక్కువవుతున్నాయి.

Also Read:  TDP vs YCP : పగలు టీడీపీతో రాత్రి వైసీపీతో సంసారం చేసేవాడు దేవినేని ఉమా.. శ‌వాల ద‌గ్గ‌ర చిల్ల‌ర రాజ‌కీయమా..?

Exit mobile version