HMDA : హైదరాబాద్‌లో ‘రియల్’ బూమ్ కోసం ఏం చేయబోతున్నారంటే..

HMDA : హైదరాబాద్‌ మహానగరంలో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. 

  • Written By:
  • Publish Date - January 20, 2024 / 01:00 PM IST

HMDA : హైదరాబాద్‌ మహానగరంలో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది.  ఇందులో భాగంగా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(HMDA) పరిధిలోని జోన్లను పెంచే ఛాన్స్ ఉందని అంటున్నారు. హెచ్‌ఎండీఏ ప్రస్తుతం ఏడు జిల్లాల్లో 7,228 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లోని కొంత భాగం, భువనగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాలు హెచ్‌ఎండీఏ పరిధిలోకి వస్తాయి. మొత్తం 849 గ్రామాలు ఈ హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌ పరిధిలో ఉన్నాయి. ఈ అన్ని జిల్లాలను శంషాబాద్‌, మేడ్చల్‌, శంకర్‌పల్లి, ఘట్‌కేసర్‌ జోన్ల కింద విభజించారు. వీటి పరిధిలో ఏటా కొత్త లేఅవుట్లు, భారీ అంతస్తుల నిర్మాణాలకు ప్రజలు, రియల్ ఎస్టేట్ డెవలపర్ల నుంచి అప్లికేషన్లు  వస్తున్నాయి. ఈ దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే  ఛాన్స్ ఉంది. దీంతో హెచ్‌ఎండీఏపై  బాధ్యత, పనిభారం మరింత పెరిగింది. ఈనేపథ్యంలో ఆ సంస్థ బలోపేతానికి కాంగ్రెస్ సర్కారు కసరత్తు చేస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ కావాలంటే ప్రభుత్వ పరంగా అనుమతుల ప్రక్రియ స్పీడప్ కావాలి. ఇప్పటికే టీఎస్‌బీపాస్‌ ద్వారా దరఖాస్తులు పెట్టుకున్న నిర్ణీత గడువులోనే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే సంబంధిత అధికారులకు జరిమానా విధించే అధికారం ఉన్నతాధికారులకు ఉంటుంది. ఏ అధికారి వద్ద ఫైల్ ఎన్ని రోజులు ఉందో సహేతుకమైన కారణాలను చెప్పాల్సిందే. ఎలాంటి కారణాలు లేకుండా ఫైల్‌‌ను ఉద్దేశపూర్వకంగా పక్కన పెడితే చర్యలు తీసుకుంటారు. గతంలో నిర్లక్ష్యం వహించిన పలువురు అధికారులపై చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నాలుగు జోన్ల నుంచి భారీగా దరఖాస్తులు వస్తుండటంతో హెచ్‌ఎండీఏ సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం నాలుగు జోన్లకు 20 నుంచి 25 మంది వరకు పీవోలు, ఏపీవోలు ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. దీంతో దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరుగుతోంది. కొన్నిసార్లు లేఅవుట్లు, భవనాల అనుమతుల కోసం నెల, రెండు నెలలపాటు దరఖాస్తుదారులు తిరగాల్సి వస్తోంది. ఈ ప్రాబ్లమ్ లేకుండా చేసేందుకు  ప్రస్తుతమున్న హెచ్ఎండీఏ జోన్ల సంఖ్యను రెట్టింపు చేసి అదనపు సిబ్బందిని నియమించాలని ప్రభుత్వ వర్గాలు యోచిస్తున్నాయట. ఒక్కో జోన్‌ను రెండు భాగాలు చేసి.. వాటి కిందకు కొన్ని మండలాలను చేర్చాలనేది ప్రణాళిక.

Also Read: Tomatoes- Blood Pressure: టమోటాలు- అధిక రక్తపోటు మధ్య సంబంధం ఏమిటి..? అధ్య‌య‌నాలు ఏం చెబుతున్నాయి..?