New Ration Cards : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం ఖమ్మం జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. గత ప్రభుత్వాలు ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చేవని.. కానీ, తమ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వనుందని పేర్కొన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తామని తెలిపారు. ఇప్పటికే ఒక సెగ్మెంటుకు 3,500 చొప్పున ఇళ్లను కూడా కేటాయించామన్నారు. నాలుగు విడత్లలో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి, గతంలోనూ రేషన్ కార్డు లేని వారిని దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రజావాణి పేరిట దరఖాస్తులు సైతం స్వీకరించారు. రాష్ట్రంలో 89.96 లక్షల మందికి రేషన్ కార్డులున్నాయి. ఆ రేషన్ కార్డుల పరిధిలో 2.1 కోట్ల మంది సభ్యులున్నారు. వీటిలో 5.66 లక్షల మందికి అంత్యోదయ కార్డులు, అన్నపూర్ణ స్కీమ్ కింద 5,416 కార్డులు ఉన్నాయి. తెల్ల కార్డుదారులకు 6 కేజీల బియ్యం (కేంద్రం నుంచి 5 కిలోలు, రాష్ట్రం నుంచి 1 కిలో) అందజేస్తున్నారు. అన్నపూర్ణ లబ్ధిదారులకు 10 కిలోల బియ్యాన్ని రాష్ట్రం ఇవ్వగా, అంత్యోదయ కార్డుదారులకు కేంద్రం 35 కేజీల బియ్యం అందజేస్తున్నాయి. కార్డుల జారీకి ఇప్పటి వరకు వార్షికాదాయాన్ని అర్హతగా తీసుకుంటున్నారు.
ఇకపోతే..రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల జారీకి దరఖాస్తుల స్వీకరణ ఉండదని పౌరసరఫరాల శాఖ కీలకవర్గాలు వివరించాయి. అర్హులైన పేదల్లో రేషన్‌కార్డులు ఉన్నవారి, లేనివారికి సంబంధించిన సమాచారం ఉంది. కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ‘సామాజిక, ఆర్థిక సర్వేలో రాష్ట్రంలోని పేదల వివరాలున్నాయి. ప్రతిపాదిత అర్హుల వివరాల జాబితాను గ్రామసభలు, బస్తీ సభల్లో ప్రదర్శించనున్నారు. అక్కడే కొత్త రేషన్ కార్డులకు అర్హులైన వారి పేర్లు ఖరారవుతాయి. ఇదిలా ఉండగా కొత్త రేషన్‌కార్డుకు సంబంధించిన డిజైన్ ఇంకా ఖరారు కాలేదు. ఆ ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశముందని పౌరసరఫరాల శాఖ వర్గాలు వివరించాయి.
Read Also: Ravindra Jadeja: టెస్టులకు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ జడేజా రిటైర్మెంట్?