తెలంగాణలో ప్రచారం పర్వం నేటితో ముగియనుంది. అయితే.. ఈ నేపథ్యంలో నేడు వికారాబాద్ జిల్లాలోని తాండూరులో నిర్వహించి కాంగ్రెస్ జనజాతర సభలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ధర్మం గురించి బీజేపీ మాట్లాడి విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అధికారం తమ చెప్పుచేతల్లో ఉండాలన్నదే బీజేపీ లక్ష్యమని ఆమె అన్నారు. ప్రజల సంపదను తీసుకొని వేరే వాళ్లకు కాంగ్రెస్ ఇస్తుందని బీజేపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆమె విమర్శించారు. హిందూ ధర్మంలో నేర్పించింది ధర్మ పథంలో నడవమని.. సత్యం, అహింస అన్న సిద్ధాంతాలపై గాంధీ జీ జీవితాంతం సాగి స్వాతంత్ర్యాన్ని సాధించారని ప్రియాంక గాంధీ అన్నారు. మహత్మ గాంధీ తన ఆఖరి క్షణంలో హే రామ్ అంటూ తనువు చాలించారని, దేశంలోని ప్రతి ధర్మం సత్యం తోనే నడవమని బోధిస్తోందని, హింసా మార్గంలో వెళ్లమని ఏ ధర్మం బోధించలేదని ఆమె వ్యాఖ్యానించారు. ధర్మం పేరిట అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని, ధర్మం పేరిట మనుషుల మధ్య విభేదాలు సృష్టించడం పాపమని ప్రియాంక గాంధీ అన్నారు.
రాజ్యాంగాన్ని భారత ప్రజలు రచించారు.. మోదీ కాదని, పూర్వీకులు రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి తమ రక్తాన్ని, చమటను ధారపోశారని ఆమె వ్యాఖ్యానించారు. 400 వందల సీట్లు ఇస్తే దేశ రాజ్యాంగాన్ని మారుస్తానని ప్రధాని మోదీ అంటున్నారని, ఈ రాజ్యాంగం దేశం లోని 140 కోట్ల మందిది.. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చనివ్వమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్ని అబద్ధాలు చెప్పాల్లో అన్ని చెప్పింది.. ఇక ముందు ప్రజలు ఆ పార్టీకి సహకరించరు.. పదేళ్ల లో ఏం చేశారని మోదీ, బీజేపీ నేతలను నిలదీయండని ఆమె అన్నారు. తెలంగాణ ప్రాంతం సుభిక్షమైంది.. ఈ ప్రాంతం కోసం ఎన్నో త్యాగాలు చేశారని, స్వయం కృషితో ఐటీ ని అభివృద్ధి చేసుకున్నారని ఆమె అన్నారు. విద్వేషాన్ని పెంపొందించడం వల్ల ప్రయోజనం ఉండదన్న సంకేతాన్ని తెలంగాణ ప్రజలు ఇవ్వాలని, విద్వేషాలు పెచ్చరిల్లితే సామాన్యులకు నష్టం జరుగుతుందన్నారు ప్రియాంక గాంధీ.
We’re now on WhatsApp. Click to Join.
నల్లధనం తీసుకువస్తా, అవినీతి నిర్మూలిస్తామని చెప్పిన మోదీ ఎలక్ట్రోల్ బాండ్ లతో అసలైన అవినీతికి పాల్పడ్డారని, కోటీశ్వరులకే మోదీ హయాంలో వికాసం జరిగిందన్నారు. పదేళ్లలో ఏం చేశానో చెప్పేంత ధైర్యం మోదీ చేయలేదని ఆమె విమర్శించారు. కన్నీళ్లు పెట్టుకున్నాడు తప్ప దేశానికి ఏం చేశాడో ప్రధాని ఒక్క వేదికపైన చెప్పలేదని, కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి తప్ప తాను ఏం చేశాడో ప్రధాని చెప్పడం లేదన్నారు ప్రియాంక. కాంగ్రెస్ పథకాలకు ప్రధాని మోదీ తన ఫోటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని, ప్రజలకు సంపదను పంచే విధానం కాంగ్రెస్ న్యాయ్ పత్రంలో ఉందని ఆమె వెల్లడించారు. రైతులకు కనీస మద్దతు ధర ను చట్ట పరిధిలోకి తీసుకువస్తామని, వ్యవసాయ ఆధారిత వస్తువులపై జీఎస్టీ తొలగిస్తామని, రైతులకు రుణ మాఫీ కోసం ప్రణాళిక తయారు చేస్తామని, శ్రామికుల కోసం రోజుకు కనీస వేతనం 400 వందలకు పెంచుతామని, ప్రతి కుటుంబంలో మహిళ అకౌంట్ లో యేడాదికి లక్ష రూపాయలు వేస్తామని, యువకుల కోసం ఐదు వేల కోట్ల నిధిని ఏర్పాటు చేస్తామని, డిగ్రీ పూర్తి చేసిన యువకులకు మొదటి ఉద్యోగం పక్కా అన్న కార్యక్రమాన్ని తీసుకువస్తామని ఆమె హామీ ఇచ్చారు. తెలంగాణ లో ఇచ్చిన గ్యారంటీలు మా ప్రభుత్వం అమలు చేస్తోందని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన త్రిబుల్ ఆర్ సినిమా చూశారా.. మనకు డబల్ఆర్ ఉన్నారు.. ఆర్ అంటే రేవంత్ రెడ్డి, మరో ఆర్ అంటే రాహుల్ గాంధీ.. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని ఆమె వెల్లడించారు.
Read Also : Rahul Gandhi : తనపై వైఎస్ఆర్ ప్రభావం గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ