Site icon HashtagU Telugu

Ponguleti Srinivas Reddy : సొంత కుంప‌టి న‌ష్ట‌మే.. వ్యూహం మార్చిన పొంగులేటి.. అనుచ‌రుల ఒత్తిడితో ఓ క్లారిటీ

Ponguleti Srinivas Reddy Confusion in joining party

Ponguleti Srinivas Reddy Confusion in joining party

తెలంగాణ(Telanagan) రాజ‌కీయాల్లో ఖ‌మ్మం(Khammam) జిల్లాకు చెందిన‌ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి స‌స్పెండ్ అయిన త‌రువాత సీఎం కేసీఆర్ పై పొంగులేటి కాలు దువ్వుతున్నాడు. ఖ‌మ్మం ఉమ్మ‌డి జిల్లాలో ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ నేత‌ల‌ను ఓడిస్తాన‌ని శపధాలు సైతం చేశారు. అయితే, ఆయ‌న ఏ పార్టీలో చేరుతార‌నే విష‌యంపై రెండు నెల‌లుగా స‌స్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది. ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో వ‌రుస‌గా ఆత్మీయ స‌మావేశాలు నిర్వ‌హించి మీ అంద‌రికి ఆమోద‌యోగ్య‌మైన పార్టీలోనే చేరుతాన‌ని పొంగులేటి చెబుతూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్‌, బీజేపీ ముఖ్య‌నేత‌లు పొంగులేటితో భేటీ అవుతూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నా ఆయ‌న ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డితో పాటు జూప‌ల్లి కృష్ణారావు ప‌లువురు కీల‌క నేత‌లు అంతాక‌లిసి సొంత పార్టీ పెట్టాల‌ని భావించిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆ ఆలోచ‌న‌ను విర‌మించుకున్న‌ట్లు తెలిసింది. సొంత పార్టీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప‌ది మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించుకున్నా.. వారు అధికార పార్టీవైపు వెళ్ల‌ర‌నే గ్యారెంటీ లేద‌ని భావించిన వారు సొంత పార్టీ ఆలోచ‌న‌ను ప‌క్క‌న పెట్టినట్లు స‌మాచారం. అయితే, ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్యాడ‌ర్ బ‌లంగా ఉంది, బీజేపీకి జిల్లాలో అంత‌గా ప‌ట్టులేదు. దీంతో అనుచ‌రులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల‌ని పొంగులేటిపై ఒత్తిడి తెస్తున్న‌ట్లు తెలుస్తోంది.

రెండురోజుల క్రితం పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డితో ఈట‌ల మ‌రోసారి భేటీ అయ్యారు. ఈ భేటీలోనూ పొంగులేటి బీజేపీలో చేరిక‌పై స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వ‌లేద‌ని తెలిసింది. జూన్ మొద‌టి వారంలో త‌న నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు పొంగులేటి బీజేపీలోకి చేరేందుకు ఆస‌క్తి చూపిన‌ట్లు స‌మాచారం. ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం, ఆ త‌రువాత తెలంగాణ‌లో కాంగ్రెస్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుండ‌టంతో కేసీఆర్ ప్ర‌భుత్వానికి చెక్ పెట్టాలంటే కాంగ్రెస్ లో చేరితేనే మంచిద‌న్న అభిప్రాయానికి పొంగులేటి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

పొంగులేటి ఒక‌వేళ కాంగ్రెస్ చేరితే ఆయ‌న వ‌ర్గీయులు అనుకున్న స్థాయిలో టికెట్లు ఇప్పించుకునే ప‌రిస్థితి లేదు. జిల్లాలో భ‌ట్టి, రేణుక చౌద‌రి వ‌ర్గాలు బ‌లంగా ఉన్నాయి. వీరిని కాద‌ని పొంగులేటి, ఆయ‌న వ‌ర్గీయుల‌కు కావాల్సిన స్థానాల్లో కాంగ్రెస్ అధిష్టానం టికెట్లు ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఒక‌వేళ బీజేపీలోకి వెళితే పొంగులేటి, ఆయ‌న వ‌ర్గీయులు అనుకున్న నియోజ‌క‌వ‌ర్గంలో బ‌రిలోకి దిగొచ్చు. కానీ బీజేపీకి జిల్లాలో ఆశించిన స్థాయిలో క్యాడ‌ర్ లేక‌పోవ‌టంతో పొంగులేటి ఆ పార్టీలో చేరేందుకు వెనుక‌డుగు వేస్తున్న‌ట్లు స‌మాచారం.

 

Also Ready : Bandi Sanjay: బీజేపీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవు: బండి సంజయ్