Local Body Elections Telangana : సెంటిమెంట్ లతో స్థానిక ఎన్నికలను క్యాష్ చేసుకోవాలని చూస్తున్న రాజకీయ పార్టీలు

Local Body Elections Telangana : హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికలు జరగాల్సిందేనన్న స్పష్టత నేపథ్యంలో, రాజకీయ పార్టీలు తమ తమ అజెండాలను సిద్ధం చేసుకుంటున్నాయి

Published By: HashtagU Telugu Desk
Congress

Congress

తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికలు జరగాల్సిందేనన్న స్పష్టత నేపథ్యంలో, రాజకీయ పార్టీలు తమ తమ అజెండాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఒక వైపు బీసీ రిజర్వేషన్లను అస్త్రంగా మలుచుకుంటుండగా, బీజేపీ హిందూ ముస్లిం రిజర్వేషన్ సెంటిమెంట్‌తో ఎదురుదాడికి సిద్ధమవుతోంది. ఇక బీఆర్‌ఎస్ మాత్రం చంద్రబాబు, బనకచర్ల నీటి వివాదాలను ఎత్తి చూపించేందుకు ప్రయత్నిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గ ఓటుబ్యాంకును తమవైపు తిప్పుకునే వ్యూహంతో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రధానంగా ముందుంచుతోంది. ఉచిత బస్‌, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రుణమాఫీ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, బీసీలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించేందుకు కేంద్రాన్ని ఒత్తిడి చేస్తామని ప్రకటిస్తోంది. కులగణన ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా ఆర్డినెన్స్‌ను తీసుకురావడమే కాకుండా, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లును ఆమోదింపజేయాలన్న డిమాండ్‌ను పెంచుతోంది.

BRS Will Merge with BJP : బిజెపి లో బిఆర్ఎస్ విలీనం కేటీఆర్ భారీ డీల్ ! – సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ మాత్రం కాంగ్రెస్ వ్యూహానికి విరుగుడుగా మత ప్రాతిపదికన రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తోంది. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీలకు నష్టం జరుగుతోందని ప్రచారం చేస్తోంది. రిజర్వేషన్లలోని 10 శాతం ముస్లింలకు వెళ్తుందన్న ఆరోపణలు చేస్తూ, కాంగ్రెస్‌ను బీసీలను మోసం చేస్తున్న పార్టీగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోంది. బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ బీజేపీ నేత రామచందర్‌రావు చేసిన వ్యాఖ్యలు ఈ దిశగా సాగుతున్న ప్రచారానికి బలం ఇస్తున్నాయి.

మరోవైపు బీఆర్‌ఎస్ మాత్రం స్థానిక ఎన్నికల్లో బీసీలను గురిచేయడం కాకుండా, తన పాత “తెలంగాణ గర్వం” సెంటిమెంట్‌ను తిరిగి బలంగా వినిపించాలనే దిశగా పనిచేస్తోంది. చంద్రబాబు పేరు తీసుకువచ్చి, బనకచర్ల నీటి వివాదాన్ని పెద్దచెప్పుగా చూపిస్తూ బీజేపీతో కాంగ్రెస్ మైత్రి అంటూ విమర్శలు చేస్తోంది. బీఆర్‌ఎస్ నాయకులు ఎక్కడ సమావేశాలకు వెళ్లినా, తమ ప్రసంగాల్లో కృష్ణా, గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్ కేంద్రానికి తలవంచిందనే ఆరోపణలు చేస్తున్నారు. అయితే ప్రజలు ప్రస్తుతం నీటి సమస్య కంటే బీసీ ప్రాతినిధ్యం, సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం. మరి ఎవరి సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో చూద్దాం.

  Last Updated: 26 Jul 2025, 05:36 PM IST