Infant Death: ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం.. ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహానికి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

Published By: HashtagU Telugu Desk
Infant Death

Infant Death

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహానికి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పెండింగ్‌లో ఉన్న చలాన్‌పై సుమారు గంటపాటు ట్రాఫిక్‌ పోలీసులు వాహనం ఆపడంతో ఆస్పత్రికి చేరుకోవడంలో ఆలస్యమై మూడు నెలల పసికందు మృతి చెందింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

జనగాం జిల్లా మరిగడి గ్రామానికి చెందిన ఓ దంపతులు తమ మూడు నెలల పసికందును హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కారును అద్దెకు తీసుకున్నారు. కారు డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో యాదాద్రి సమీపంలోని వంగపల్లి వద్ద ట్రాఫిక్ కానిస్టేబుళ్లు కారును ఆపారు. అనంతరం కారుకి చ‌లానా పెండింగ్ లో ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ చలాన్ చెల్లించడానికి దాదాపు అరగంట సమయం పట్టింది. మూడు నెలల శిశువు రేవంత్ రెండ్రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. మంగళవారం అతన్ని జనగాంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించాలని వైద్యులు తల్లిదండ్రులకు సూచించారు.తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వెళుతుండగా వారి కారును పోలీసులు అడ్డుకున్నారు. తమ కుమారుడికి అత్యవసర వైద్యం అవసరమని.. హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతించాలని బాధితులు కోరినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు.

చలాన్‌ చెల్లింపునకు దాదాపు అరగంట సమయం పట్టింది. దంపతులిద్దరూ తార్నాకకు చేరుకోగా.. పాప కదలికలు కనిపించలేదు. ఆసుపత్రికి చేరుకోగా అరగంట క్రితం చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సకాలంలో ఆసుపత్రికి చేరుకుని ఉంటే తమ కొడుకు బతికేవాడని చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు. మరోవైపు మెడికల్ ఎమర్జెన్సీకి వెళ్లే వాహనాలను ఎప్పటికీ ఆపబోమని యాదగిరిగుట్ట ట్రాఫిక్ సీఐ సైదయ్య తెలిపారు.

  Last Updated: 01 Jun 2022, 01:50 PM IST