న్యూ ఇయర్ వేడుకలకు (New Year Celebrations) యావత్ ప్రజలు సిద్ధం అవుతున్నారు. మరికొద్ది గంటల్లో కొత్త ఏడాదిలో అడుగుపెట్టబోతున్న సందర్బంగా చాలామంది 2024 కు గ్రాండ్ గా వీడ్కోలు పలకాలని చూస్తున్నారు. ఇక హైదరాబాద్ (Hyderabad) లో ప్రతి ఏడాది న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని తాకుతాయనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు న్యూ ఇయర్ వేడుకలపై నిఘా పెట్టారు. పబ్‌లు, బార్‌లు, హోటళ్లలో జరిగే సెలబ్రేషన్స్‌కు పటిష్ఠమైన చర్యలు చేపట్టారు. నార్కోటిక్, ఎక్సైజ్, ఎస్ఓటీ విభాగాలతో కలిసి పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. మైనర్లను బార్లకు అనుమతిస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్ యజమానులకు సౌండ్ పొల్యూషన్ తగ్గించేందుకు సౌండ్‌ప్రూఫ్ ఫెసిలిటీస్ కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
పబ్‌లు, హోటళ్లపై పోలీసుల ఆంక్షలు :
జూబ్లీహిల్స్‌లోని మొత్తం 36 పబ్‌లలో నాలుగు పబ్‌లకు అనుమతులు నిరాకరించారు. హార్డ్ కప్, అమ్నేషియా, బ్రాడ్ వే, బేబీలాన్ పబ్‌లకు గత వివాదాలు, పోలీసు కేసుల నేపథ్యంలో అనుమతులేమని స్పష్టం చేశారు. అర్ధరాత్రి ఒంటి గంటలోగా వేడుకలు ముగించుకోవాలని సూచించారు. మద్యం సేవించిన వారికి వాహనాలు నడపనీయకూడదని, అలాంటి వ్యక్తుల ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పబ్ యాజమాన్యాలకు సూచించారు.
ట్రాఫిక్ ఆంక్షలు :
నగరంలోని ముఖ్యమైన ఫ్లైఓవర్లు డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి, షేక్‌పేట్, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి వంటి ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రజల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
క్యాబ్స్, ఆటో డ్రైవర్లకు సూచనలు :
క్యాబ్‌లు, ఆటో డ్రైవర్లు తమ వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కలిగి ఉండాలని, యూనిఫామ్ ధరించాలని పోలీసులు సూచించారు. ప్రయాణికులను మర్యాదగా అందుకోవాలని, ఎటువంటి అదనపు ఛార్జీలు వేయకూడదని స్పష్టం చేశారు. రైడ్ రిజెక్ట్ చేస్తే ఫిర్యాదులు అందించే ప్రత్యేక నంబర్‌ను అందుబాటులో ఉంచారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు :
రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని హెచ్చరించారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని, సంబంధిత యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు సూచనలను గౌరవించాలని, నిబంధనలను పాటించడంలో ప్రజలు సహకరించాలని కోరారు.
Read Also : Social Media : ‘సోషల్ మీడియాను మంచికే వాడుదాం’ అంటూ సరికొత్త క్యాంపెయిన్