FarmHouse Files : `ఫామ్ హౌస్` ఫైల్స్ కు `ఫోన్ ట్యాపింగ్` చెక్

ఫామ్ హౌస్ `ఫైల్స్ ` వ్య‌వ‌హారం కొత్త మ‌లుపు తీసుకోనుంది. ఒకప్పుడు `ఓటుకునోటు` కేసుకు ప్ర‌తిగా ఫోన్ ట్యాపింగ్ కేసు న‌మోదు అయిన విష‌యం విదిత‌మే.

  • Written By:
  • Updated On - November 4, 2022 / 04:17 PM IST

ఫామ్ హౌస్ `ఫైల్స్ ` వ్య‌వ‌హారం కొత్త మ‌లుపు తీసుకోనుంది. ఒకప్పుడు `ఓటుకునోటు` కేసుకు ప్ర‌తిగా ఫోన్ ట్యాపింగ్ కేసు న‌మోదు అయిన విష‌యం విదిత‌మే. ఇప్పుడు కూడా సేమ్ టూ సేమ్ అదే జ‌రిగే దిశ‌గా అడుగులు ప‌డుతున్న‌ట్టు నిందితుల్లో ఒక‌రైన నంద‌కుమార్ స‌తీమ‌ణి చిత్ర‌లేఖ హైకోర్టులో పిటిష‌న్ ఆధారంగా అర్థం అవుతోంది. రాజకీయ కుట్రలో భాగంగా నందకుమార్ ఫోన్ ను ట్యాప్ చేసి వ్యక్తిగత సంభాషణలను రికార్డు చేసి, ఆ ఆడియో టేపులను బయటకు రిలీజ్ చేశారని ఆమె పిటిష‌న్లో పేర్కొన్నారు. ఇది టెలిగ్రాఫిక్ చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలియ‌చేస్తూ న్యాయ‌స్థానం మెట్లు ఎక్కారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ ఫైల్స్ కు సంబంధించిన వీడియోల‌ను దేశ వ్యాప్తంగా ప‌లు వ్య‌వ‌స్థ‌ల‌కు అందించారు. సుప్రీం కోర్టు జ‌డ్జిలు, వివిధ రాష్ట్రాల‌కు చెందిన హైకోర్టు జ‌డ్జిలు, సీబీఐ, ఈడీ, సెంట్రల్ విజిలెన్స్ , అన్ని రాజ‌కీయ పార్టీల‌కు చెందిన అధిప‌తుల‌కు మూడు గంట‌ల నిడివిగ‌ల వీడియోతో పాటు 700 పేజీల వివ‌రాల‌ను జ‌త చేస్తూ అంద‌చేశారు. ఆ మేర‌కు మీడియా స‌మావేశంలో కేసీఆర్ వెల్ల‌డించారు. అంతేకాదు, ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొట్టిన వైనం, రాబోవు రోజుల్లో తెలంగాణ‌, ఏపీ, రాజ‌స్తాన్‌, ఢిల్లీ ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొట్టే ఎత్తుగ‌డ‌లకు సంబంధించిన ఆధారాల‌ను బ‌య‌ట‌పెట్టారు. ఇదంతా ఒక ఎత్తుగ‌డ అయితే, ఫోన్ల ట్యాపింగ్ అంశం ఇప్పుడు నందకూమార్ స‌తీమ‌ణి చిత్ర‌లేఖ రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తోంది.

Also Read:  CM KCR: జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి గండం?కేసీఆర్, పీకే స్కెచ్!

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ భాగ్య చిత్ర లేఖ ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐతో కానీ లేక ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తో కానీ విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 26 వ తేదీన మొయినాబాద్ లోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో నంద కుమార్ తో పాటు మరో ఇద్దరిని అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారని చిత్ర లేఖ పేర్కొన్నారు. ఆపై జరిగిన వరుస పరిణామాలను పేర్కొని ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

అరెస్ట్ అనంతరం అక్టోబర్ 27వ తేదీన నిందితులను రిమాండ్ పోలీసులు కూడా ఏసీబీ కోర్టు తిరస్కరించిందని పిటిష‌న్లో పేర్కొన్న ఆమె 41ఏ కింద పోలీసులు నోటీసులు ఇవ్వకపోవడాన్ని ఏసీబీ కోర్టు తప్పు పట్టిందని, అందుకే వారిని వెంటనే విడుదల చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. ఆ తర్వాత పరిణామాలలో భాగంగా పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా కింది కోర్టు ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు నిందితులు వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది.ఆ తర్వాత పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారని చిత్ర‌లేఖ త‌న. పిటిష‌న్లో వివ‌రించారు.

Also Read:   Komatireddy Venkata Reddy: వెంకట్ రెడ్డికి మరో షోకాజ్ నోటీస్.. రెస్పాన్స్ ఇచ్చేనా!

అధికార పార్టీ నేరుగా ఈ కేసుతో ప్రమేయం ఉన్న కారణంగా రాష్ట్ర పోలీసు వ్యవస్థపై తమకు నమ్మకం లేదని, విచారణ సక్రమంగా సాగుతుంద‌న్న న‌మ్మ‌కం లేదని ఆమె పిటిషన్లో పొందుప‌రిచారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా తన భర్తను ఇరికించే ప్రయత్నం జరుగుతుందని చిత్ర‌లేఖ పేర్కొంటూ కొంద‌రి ఒత్తిడితో పెట్టిన కేసు మాత్రమే అంటూ హైకోర్టుకు తెలియ‌చేశారు. సీబీఐ లేదా సిట్ తో విచారణ జరిపించండని కోరారు. టిఆర్ఎస్, బిజెపి రాజకీయ యుద్ధంలో తన భర్త బలవుతున్నారని నందకుమార్ భార్య ఆవేదన చెందారు. ఈ కేసులో హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, సైబరాబాద్ సి పి, రాజేంద్రనగర్ ఏసీపీ, మొయినాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్,కేంద్ర హోం శాఖ కార్యదర్శి, కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రతివాదులుగా చేర్చుతూ వేసిన పిటిష‌న్ ను హైకోర్టు ప‌రిశీలిస్తోంది. మ‌రో ఓటుకునోటు కేసు మాదిరిగా ఫామ్ హౌస్ ఫైల్స్ ఎపిసోడ్ మారుతుంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.