Phone Tapping Case : గత బీఆర్ఎస్ హయాంలో విపక్ష పార్టీల నేతలు టార్గెట్‌గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న కొద్దీ కొత్తకొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ఇటీవలే బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే (నకిరేకల్) చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇవ్వగా.. ఇవాళ (నవంబరు 14) ఆయన జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఏఎస్పీ తిరుపతన్న పోలీసుల విచారణలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ కీలక నేతల పేర్లు చెప్పినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిన వివరాలను కొందరు బీఆర్ఎస్ నేతలు వాడుకొని రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందారని ఏఎస్పీ తిరుపతన్న ఫోన్ డేటా ఆధారంగా గుర్తించారట.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో..
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమ్మడి నల్గొండకు చెందిన విపక్ష పార్టీల నేతల కదలికలను పసిగట్టేందుకు జిల్లా కేంద్రంలోనే వార్ రూమ్‌ను(Phone Tapping Case) ఏర్పాటు చేశారు. ఆ వార్ రూమ్ వేదికగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈక్రమంలోనే ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్‌కు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, పైళ్ల శేఖర్ రెడ్డిలకు స్పెషల్ టీం పోలీసులు నోటీసులు అందించారనే ప్రచారం జరుగుతోంది. వరంగల్ జిల్లాకు చెందిన ఓ కీలక బీఆర్ఎస్ నేతకు కూడా త్వరలో నోటీసులు ఇస్తారని తెలిసింది.
Also Read :Prasar Bharati OTT : 20న ‘ప్రసార భారతి ఓటీటీ’ విడుదల.. ఎలాంటి కంటెంట్ ఉంటుందంటే..
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు అధికారులు కూడా గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనిచేసిన వారే కావడం గమనార్హం. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు 2015లో నల్గొండ జిల్లా ఎస్పీగా పనిచేశారు. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నల్గొండలో ఓఎస్డీగా పని చేశారు. ఏఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో పనిచేశారు. డీఎస్పీ ప్రణీత్ రావు ఎస్సైగా జిల్లాలో పలు ప్రాంతాల్లో పనిచేశారు. సీఐ గట్టు మల్లు కూడా నల్గొండ జిల్లాలో పనిచేశారు.