Site icon HashtagU Telugu

BC Reservations: తెలంగాణ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్!

BC Reservations

BC Reservations

BC Reservations: తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు (BC Reservations) 50 శాతం పరిమితిని మించి అమలు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని, దీనివల్ల మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించుతాయని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను వంగ గోపాల్ రెడ్డి దాఖలు చేశారు. గతంలో సుప్రీంకోర్టు స్పష్టంగా ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం మించకూడదు అని సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుకు ఇది విరుద్ధమని పిటిషనర్ వాదించారు.

సోమవారం విచారణకు అవకాశం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అంశంపై దాఖలైన ఈ పిటిషన్ సోమవారం (అక్టోబర్ 7, 2025) విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసును జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.

Also Read: Defection of MLAs : ముగిసిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

రిజర్వేషన్ల పరిమితిపై రాజ్యాంగ చర్చ

భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తం రిజర్వేషన్ల శాతం 50% పరిమితిని మించకుండా చూసుకోవాలి. అయితే తెలంగాణలో షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), ఇతర వెనుకబడిన తరగతులకు (BC) కలిపి రిజర్వేషన్ల కోటా 50 శాతాన్ని దాటే అవకాశం ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల శాతం పెంచాలని నిర్ణయం తీసుకోవడం వెనుక బీసీ జనాభా అధికంగా ఉన్నందున వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశం ఉంది. అయితే సుప్రీంకోర్టు పాత తీర్పును పరిగణనలోకి తీసుకుంటే ఈ నిర్ణయం చట్టపరమైన సవాలును ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఈ కీలకమైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తుందా లేక రిజర్వేషన్ల అమలుపై స్టే విధించే అవకాశం ఉందా అనే ఉత్కంఠ తెలంగాణ రాజకీయ వర్గాల్లో నెలకొంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఎన్నికల భవితవ్యాన్ని, రిజర్వేషన్ల విధానాన్ని ప్రభావితం చేయనుంది.

Exit mobile version