
Pawan Kalyan visits Niranjan’s home; the Janasena chief is set to fulfill a fan’s last wish!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణలోని హన్మకొండలో పర్యటించారు. స్థానిక హనుమాన్ నగర్‌కు చెందిన 15 ఏళ్ల నిరంజన్ అనే బాలుడు తీవ్రమైన నరాల సమస్యతో బాధపడుతున్నాడు. దురదృష్టవశాత్తూ వయసు 15 ఏళ్లయినా ఆ వ్యాధి కారణంగా కేవలం రెండు, మూడేళ్ల పిల్లాడిలాగే కనిపిస్తాడు, పైగా కాళ్లు కూడా పనిచేయవు. జీవితంతో పోరాడుతున్న ఆ చిన్నారికి తన అభిమాన హీరో పవన్ కల్యాణ్‌ను కలిసి, ఆయన సినిమా డైలాగ్‌ను ఆయన ముందే చెప్పాలనేది ఒకే ఒక్క చివరి కోరిక. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్, నేరుగా ఆ బాలుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. నిరంజన్‌ను ప్రేమగా పలకరించి, వారి తల్లిదండ్రులతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ భావోద్వేగ భేటీ ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ హన్మకొండలోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత స్థానిక రిసార్ట్‌లో జనసేన కార్యకర్తలతో (జనసైనికులతో) ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. అక్కడే లంచ్ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం తిరిగి విజయవాడకు ప్రయాణమవుతారు. మరోవైపు, పవన్ కల్యాణ్ ను చూసేందుకు హన్మకొండలో అభిమానులు పోటెత్తారు.
