తెలంగాణలో పైరసీపై జరుగుతున్న కఠిన చర్యలకు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. ప్రముఖంగా ఐబొమ్మ, బప్పం వంటి పైరసీ సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయడంతో పాటు, అతడితోనే ఆ వెబ్‌సైట్లను మూయించడం సినిమా పరిశ్రమకు ఎంతో మేలు చేసే చర్యగా పవన్ అభివర్ణించారు. “సినిమా విడుదల ఒక మహా యజ్ఞంలా మారిన ఈ కాలంలో, పైరసీ కారణంగా ప్రతి చిత్ర బృందం ఆందోళనలో పడుతోంది. ఇలాంటి సందర్భంలో హైదరాబాద్ పోలీసులు తీసుకున్న నిర్ణయం నిజంగా అభినందనీయమైనది” అని ఆయన పేర్కొన్నారు.
Kavitha : బిఆర్ఎస్ విఫలమైంది..అందుకే మీము రంగంలోకి దిగుతున్నాం – కవిత
పైరసీ కారణంగా భారతీయ సినిమా పరిశ్రమ సంవత్సరాలుగా భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతల నుంచీ పంపిణీదారుల వరకూ, థియేటర్ల నుంచీ టెక్నీషియన్ల వరకూ అందరికీ దాని ప్రభావం పడుతుందని చెప్పారు. “సినిమా చేసినవాళ్ల కష్టం, డబ్బు, సమయం అన్నీ ఒకే రోజులో నష్టపోయే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. విడుదలైన గంటల్లోనే పైరసీ లింకులు రావడం వల్ల చిత్ర బృందాలు మానసికంగా, ఆర్థికంగా కుంగిపోతున్నాయి” అని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు మరియు పోలీసు విభాగాలు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.
సైబర్ భద్రతా విభాగం ప్రస్తుత కమిషనర్ సజ్జనార్ చేపట్టిన చర్యలు దేశంలోని ఇతర రాష్ట్రాలను కూడా కదిలించాయని పవన్ అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడుతూ, “సజ్జనార్ గారి ధైర్యవంతమైన చర్యలు కేవలం తెలంగాణకే కాదు, మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమకు ఉపశమనం ఇవ్వగలవు. పైరసీ రూట్‌ను అరికట్టేలా ఇలాంటి చర్యలు దేశవ్యాప్తంగా చేపట్టాలి” అన్నారు. పైరసీపై సమిష్టిగా పోరాడితేనే సినిమా పరిశ్రమకు నిలకడ వచ్చి, కొత్త తరానికి సినీ నిర్మాణాల్లో నమ్మకం పెరుగుతుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
