Telangana: స్టార్‌ హోటళ్లలోనూ అందుబాటులోకి తాటి కల్లు : మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

ponnam prabhakar  తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగమైన గీత వృత్తికి, తాటి ఉత్పత్తులకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తాటి కల్లు, నీరాను కేవలం పానీయాలుగా కాకుండా ప్రకృతి ప్రసాదించిన ఔషధాలుగా ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోందని అన్నారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాటి కల్లుపై సమాజంలో […]

Published By: HashtagU Telugu Desk
Palm Toddy Now Available in Star Hotels Minister Ponnam Prabhakar Makes Key Announcement

Palm Toddy Now Available in Star Hotels Minister Ponnam Prabhakar Makes Key Announcement

ponnam prabhakar  తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగమైన గీత వృత్తికి, తాటి ఉత్పత్తులకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తాటి కల్లు, నీరాను కేవలం పానీయాలుగా కాకుండా ప్రకృతి ప్రసాదించిన ఔషధాలుగా ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోందని అన్నారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాటి కల్లుపై సమాజంలో ఉన్న తప్పుడు అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ నర్సరీల్లో తాటి, ఈత మొక్కల పెంపకాన్ని భారీ ఎత్తున ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో తాటి వనాల పెంపకానికి పెద్దపీట వేస్తామని, అలాగే హైదరాబాద్‌ నగరంలోని ప్రధాన, ఫైవ్ స్టార్ హోటళ్లలో కూడా స్వచ్ఛమైన కల్లు, నీరాను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. గీత కార్మికులను గౌరవించే క్రమంలో ఈ సహజ పానీయాల ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు చిలుకూరు సమీపంలోని ఎక్స్‌పీరియం పార్కులో ఈ నెల 24న ‘టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ ఎక్స్‌పీరియం’ పేరుతో మ్యూజిక్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడ ఇప్పటికే 250 రకాల తాటి మొక్కలను నాటినట్లు మంత్రి పొన్నం వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కల్లును రాష్ట్ర పానీయంగా గుర్తించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం కూడా గీత కార్మికులను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్డులో ప్రతిష్టాత్మకంగా నీరా కేఫ్‌ను ఏర్పాటు చేసిందనే విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం అక్కడ తాటి ఉత్పత్తులైన నీరా, స్వచ్ఛమైన కల్లుతో పాటు తాటి బెల్లం, తాటి ముంజెలతో చేసిన వివిధ రకాల స్వీట్లు, స్నాక్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. కాగా, ఈ కేఫ్ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా తాటి ఉత్పత్తుల మార్కెటింగ్‌ను పెంచడం ద్వారా గీత కార్మికుల ఆదాయాన్ని పెంచవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొని తాటి వనాల సంరక్షణ ప్రాధాన్యతను వెల్లడించారు.

 

 

  Last Updated: 15 May 2026, 11:41 AM IST