కరీంనగర్ కలెక్టరేట్ (Karimnagar Collectorate)లో ఆదివారం జరిగిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వ పథకాల అమలుపై చర్చ జరుగుతున్న సమయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Huzurabad MLA Padi Kaushik Reddy), జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (Sanjay Kumar) మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ తగాదా కాస్త తోపులాటకు దారితీయడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు తక్షణమే జోక్యం చేసుకుని కౌశిక్ రెడ్డిని బలవంతంగా సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సమావేశంలో మాట్లాడుతుండగా.. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. “నీది ఏ పార్టీ? ఎవరిని ప్రాతినిధ్యం వహిస్తున్నావు?” అని ప్రశ్నించారు. దీనికి సంజయ్ ఆగ్రహంతో స్పందించగా, ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రతరమైంది. దీంతో మాటల తూటాలు తోపులాటకు దారితీశాయి. పోలీసులు ఘటనను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించి, కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి బయటకు తరలించారు.
AP Building Structures : ఏపీలో మున్సిపాలిటీల చేతికి భవన నిర్మాణాల అనుమతుల అధికారం
బయటకు వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. “బీఆర్‌ఎస్ బీఫామ్‌తో గెలిచి సిగ్గు లేకుండా కాంగ్రెస్ తరఫున సంజయ్ మాట్లాడుతున్నారు” అంటూ మండిపడ్డారు. “ఏ పార్టీ తరఫున ఉన్నావో అడిగితే అది తప్పేనా?” అంటూ ప్రశ్నించారు. పోలీసుల ద్వారా తనను లాక్కెళ్లించడం న్యాయమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ కూడా మీడియాతో మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి తీరును తీవ్రంగా తప్పుబట్టారు. తనపై అనవసరంగా దాడి చేసేందుకు ప్రయత్నించారని, ఇది అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల గురించి చర్చించాల్సిన సమావేశంలో వ్యక్తిగత ప్రశ్నలు అడగడం అనవసరమని అన్నారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ పథకాల అమలుపై చర్చకు నిర్వహించిన సమావేశం, ఇద్దరి ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం, తోపులాటతో మారడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.