తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Global Summit)-2025 నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. డిసెంబర్ 8 నుంచి 11వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సును ‘నభూతో నభవిష్యతి’ అన్న రీతిలో అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్కిల్ యూనివర్సిటీ మరియు ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ భవన సముదాయాల నిర్మాణ పనులను కూడా పర్యవేక్షించి, సమ్మిట్‌పై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?
ఈ గ్లోబల్ సమ్మిట్‌కు వివిధ దేశాల నుంచి ప్రఖ్యాత సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నందున, దీని ఏర్పాట్లు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా, ప్రపంచ ప్రఖ్యాత దావోస్ సమ్మిట్ (Davos Summit) తరహాలో ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సదస్సును ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందని, తెలంగాణ రాష్ట్ర సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే వేదికగా దీనిని ఉపయోగించుకోవాలని చెప్పారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు వివిధ దేశాల రాయబారులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నందున, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ శివధర్ రెడ్డిని ప్రత్యేకంగా ఆదేశించారు.
భద్రతా విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని స్పష్టం చేస్తూ, పాసులు లేకుండా లేదా సమ్మిట్‌తో సంబంధం లేని వ్యక్తులు ఎవరూ ప్రాంగణంలోకి రావడానికి వీలు లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాఖలవారీగా నిర్దేశించిన అధికారులకు మాత్రమే ప్రవేశం ఉండాలని స్పష్టం చేశారు. అదే సమయంలో, సమ్మిట్‌ను కవర్ చేయడానికి వచ్చే మీడియా ప్రతినిధులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, వారికి సమాచారం సేకరించడంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.
