KCR : ఆ వ్యవహారంలో కేసీఆర్‌ సహా 25 మందికి నోటీసులు.. 15కల్లా వివరణ ఇవ్వాలని ఆర్డర్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మరో షాక్ తగిలింది.

  • Written By:
  • Updated On - June 11, 2024 / 02:39 PM IST

KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మరో షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణ వ్యవహారంలో జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిటీ కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కమిటీకి సారథ్యం వహిస్తున్న జస్టిస్ నరసింహారెడ్డి..  కేసీఆర్‌కు నోటీసులను పంపారు. ఈ నెల 15లోగా వివరణ ఇవ్వాలని గులాబీ బాస్‌ను ఆదేశించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ఎలాంటి పాత్రను పోషించారో తెలపాలని కేసీఆర్‌ను కోరింది. అయితే వివరణను పంపేందుకు తనకు జులై 30 వరకు సమయం కావాలని కేసీఆర్ కోరగా..  ఇంకా గడువు  ఇవ్వలేమని జ్యుడీషియల్ కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌తో పాటు మరో 24 మందికి కూడా జ్యుడీషియల్ కమిటీ నోటీసులు పంపింది. వారి నుంచి కూడా ఒకదాని తర్వాత ఒకటిగా కమిటీకి వివరణలు వస్తున్నాయని సమాచారం.

We’re now on WhatsApp. Click to Join

ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ కొనుగోలు చేసే ప్రక్రియలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2014-15 కాలంలో టెండర్‌లను పిలవకుండా నామినేటెడ్ పద్ధతిలోనే ఫైనల్ చేసిందని జ్యుడీషియల్ కమిటీకి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ నర్సింహారెడ్డి వెల్లడించారు. నోటీసులు అందుకున్న పాతికమందిలో కేసీఆర్ ఒక్కరే రాజకీయ నాయకులని ఆయన తెలిపారు.  మిగిలిన 24 మంది ఈ అంశాలతో సంబంధమున్న వారని చెప్పారు. కేసీఆర్ సహా నోటీసులు అందుకున్న 25 మంది ఇచ్చే సమాధానాలు సంతృప్తికరంగా లేకుంటే.. వారిని వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని పిలుస్తామని జస్టిస్ నర్సింహారెడ్డి స్పష్టం చేశారు.  యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రాసెస్‌‌లో నిబంధనలను ఉల్లంఘించారని ప్రాథమిక నిర్ధారణ జరిగిందన్నారు. దీంతో ఆ కాంట్రాక్టుల కేటాయింపునకు సంబంధించి అప్పటి, ఇప్పటి బీహెచ్‌ఈఎల్ ఉన్నతాధికారుల నుంచి అవసరమైన సమాచారాన్ని తాము సేకరించినట్లు ఆయన చెప్పారు.  ఈ నోటీసులకు కేసీఆర్(KCR) ఎలాంటి వివరణ ఇస్తారు ? తదుపరి చోటుచేసుకునే పరిణామాలు ఏమిటి ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Also Read : Amaravati Vs Vizag : ఏపీ రాజధానిగా అమరావతి.. ఆర్థిక రాజధానిగా విశాఖ : చంద్రబాబు

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంలో జరిగిన అవినీతిపై విచారణను చేపట్టింది. ఆనాడు జరిగిన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో  తొలి అసెంబ్లీ సెషన్‌లోనే  కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క గతంలో అసెంబ్లీ వేదికగా ఆరోపణలు చేశారు. దీనిపై విచారణకు ఒక స్పెషల్ జడ్జితో కూడిన జ్యుడీషియల్ కమిటీని  తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ కమిటీ నుంచే కేసీఆర్‌కు నోటీసులు జారీ అయ్యాయి.