తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికుల సౌకర్యార్థం సాంకేతికతను అందిపుచ్చుకుంటూ కీలక మార్పులు చేస్తోంది. బస్ పాస్ రెన్యువల్ కోసం కౌంటర్ల వద్ద గంటల తరబడి నిలబడే కష్టాలకు స్వస్తి చెబుతూ, ‘మీ టికెట్ (Mee Ticket)’ యాప్ ద్వారా డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
కౌంటర్ల వద్ద క్యూ కష్టాలకు చెక్
హైదరాబాద్ వంటి మహానగరాల్లో బస్ పాస్ రెన్యువల్ చేసుకోవడం ఒకప్పుడు ప్రయాణికులకు పెద్ద సవాలుగా ఉండేది. అయితే, ఇప్పుడు ‘మీ టికెట్’ యాప్ ద్వారా ఈ ప్రక్రియను ప్రభుత్వం అత్యంత సరళతరం చేసింది. ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఈ సేవలకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేవలం కొద్ది రోజుల్లోనే వేల సంఖ్యలో ప్రయాణికులు ఈ యాప్ ద్వారా పాస్‌లు పొందుతున్నారు. ప్రస్తుతానికి సాధారణ ప్రయాణికులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉండగా, త్వరలోనే స్టూడెంట్ బస్‌పాస్‌లకు కూడా ఈ వెసులుబాటు కల్పించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
డిజిటల్ పాస్ పొందే సులభమైన విధానం
స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ప్రయాణికుడు ప్లే స్టోర్ నుండి ‘మీ టికెట్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. యాప్‌లోని ‘బస్ పాసెస్’ విభాగంలోకి వెళ్లి ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, డీలక్స్ లేదా పుష్పక్ వంటి తమకు కావలసిన కేటగిరీని ఎంచుకోవాలి. నెలవారీ పాస్ కోసం దరఖాస్తు చేసే సమయంలో లైవ్ సెల్ఫీ ఫోటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో పేమెంట్ పూర్తి చేయగానే డిజిటల్ పాస్ జనరేట్ అవుతుంది. బస్సులో ప్రయాణించే సమయంలో కండక్టర్‌కు ఈ డిజిటల్ పాస్‌ను చూపిస్తే, వారు తమ వద్ద ఉండే టిమ్ (TIM) మిషన్‌తో స్కాన్ చేసి ధృవీకరిస్తారు.
టీ-24 టికెట్లకు పెరిగిన ఆదరణ
నెలవారీ పాస్‌లతో పాటు 24 గంటల పాటు నగరంలో ఎక్కడైనా ప్రయాణించేందుకు వీలు కల్పించే ‘టీ-24’ (T-24) డిజిటల్ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 2 వరకు జరిగిన అమ్మకాల్లో అత్యధికంగా ఈ టికెట్లే ఉండటం విశేషం. ప్రస్తుతం సిటీ ఆర్డినరీ పాస్ ధర రూ. 1400 ఉండగా, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ. 1600, డీలక్స్ రూ. 1800 మరియు పుష్పక్ ఏసీ పాస్ రూ. 5000 గా నిర్ణయించారు. ఈ డిజిటల్ విధానం వల్ల అటు ఆర్టీసీకి కాగితపు ఖర్చు తగ్గడంతో పాటు, ఇటు ప్రయాణికులకు సమయం ఆదా అవుతోంది.
