Record Price : పసుపు ఆల్‌టైం రికార్డు ధర.. ఎంతో తెలుసా ?

Record Price : పసుపు ఆల్‌టైం రికార్డు ధర పలికింది.

Published By: HashtagU Telugu Desk
Turmeric Remedy

Turmeric Remedy

Record Price : పసుపు ఆల్‌టైం రికార్డు ధర పలికింది. నిజామాబాద్‌ మార్కెట్‌లో క్వింటా పసుపునకు రూ.18,299 ధర లభించింది. ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌కు చెందిన రైతు తీగల గంగారెడ్డి మార్కెట్‌కు తీసుకొచ్చిన 18 క్వింటాళ్లకు ఈ ధర దక్కింది. 60 శాతం మంది రైతులకు లభించే సరాసరి ధర ఈ నెల మొదటి వారంలో రూ.12,500 ఉండగా, సోమవారం రూ.14,500 పలికింది. నిజామాబాద్‌ మార్కెట్లో 2011 సంవత్సరం తర్వాత ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. 2011లో క్వింటా పసుపు ఆల్‌టైమ్‌ రికార్డు ధర రూ.16,166 పలికింది. ఆ తర్వాతి నుంచి ప్రతి సంవత్సరం సగటున రూ.6వేల నుంచి 7 వేల మధ్యనే పసుపు ధరలు పలికాయి.

We’re now on WhatsApp. Click to Join

నాలుగు రోజుల క్రితం జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మార్కెట్‌లోనూ క్వింటాలు పసుపునకు  రూ.15,111 ధర  దక్కింది. మెట్‌పల్లి మార్కెట్‌లో పసుపునకు ఈ ధర రావడం 15 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లోనూ పసుపునకు ఇంతకుమించి ధర పలుకుతున్నప్పటికీ.. దూరా భారం నేపథ్యంలో చాలామంది రైతులు మెట్‌పల్లి, నిజామాబాద్‌ మార్కెట్లకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణలో ఏటా రైతులు పసుపు సాగు విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నారు. దాని సాగుకు దూరమవుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రస్తుత ధరలు పసుపు రైతులకు మళ్లీ జీవం పోస్తున్నాయి.

Also Read :CAA Decoded : సీఏఏ వచ్చేసింది.. పౌరసత్వంపై గైడ్ లైన్స్.. టాప్ పాయింట్స్

గత ఏడాది పదివేల వరకు ధరలు రాగా, ఈ సీజన్​లో మాత్రం అధిక ధరలు వస్తున్నాయి.  పసుపు ధరలు ఇలాగే కొనసాగిస్తే రానున్నరోజుల్లో పసుపు పంట విస్తీర్ణం మరింత పెరిగే అవకాశముందని రైతులు చెబుతున్నారు. పసుపు పంటకు కనీస మద్దతు ధర రూ. 15 వేలు నిర్ణయించాలని కొంతకాలంగా రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా.. రైతులు కోరిన విధంగా రూ. 15 వేలకు పైగా ధర పలకటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read :CAA: పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటి..? ఇది ఎవ‌రికీ వ‌ర్తిస్తుంది..?

ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు మన్యంలో ఈ ఏడాది పసుపు ధర ఆశాజనకంగా ఉండడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన్యంలో పసుపు క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఏజెన్సీ వారపు సంతల్లో, పసుపు పండించే గిరిజన గ్రామాల్లో వాటి క్రయవిక్రయాల దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. గ్రామాల్లో భూమిలోని పసుపును తవ్వేవాళ్లు, దానిని పెద్ద పాత్రల్లో వేసి ఉడకబెట్టడడం, తరువాత ఎండ బెట్టడడం చేస్తుండగా, పూర్తిగా ఎండిన తరువాత వారపు సంతలకు తీసుకువచ్చి విక్రయించుకుంటున్నారు.  దేశీయ మార్కెట్‌లో పసుపు కొనుగోలుకు ట్రేడర్లు ముందుకు వస్తుండడంతో డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా ధర గతంతో పోలిస్తే కిలోకు రూ.20 వరకు పెరిగింది. ఏజెన్సీ వ్యాప్తంగా సుమారుగా 20 వేల ఎకరాల్లో గిరిజనులు పసుపును సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది జనవరి నెలాఖరు, ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఏజెన్సీ వారపు సంతల్లో పసుపు క్రయవిక్రయాలు మొదలవుతాయి. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో విక్రయాలు ముగుస్తాయి.

  Last Updated: 12 Mar 2024, 08:20 AM IST