Rajiv Swagruha : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు సంబంధించి ఖాళీగా ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాలు, బహుళ అంతస్తుల భవనాలను వేలం వేయాలని నిర్ణయించింది. ఖాళీగా ఉన్న స్థలాలు, నిర్మాణాల స్థితిగతులపై తెలంగాణ ప్రభుత్వం మూడు ఉన్నతస్థాయి కమిటీలతో అధ్యయనం చేయించింది. ఆ కమిటీల నివేదికలను సమీక్షించిన తర్వాతే వాటిని విక్రయించాలని నిర్ణయించారు. మొత్తం మీద ఈ వేలం పాటల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. ఈ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆదాయంలో రూ.1,700 కోట్ల దాకా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధి నుంచే వస్తుందని తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ అధికార వర్గాలు చెబుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 760 ఫ్లాట్లతో పాటు పలు అపార్టుమెంట్లు(Rajiv Swagruha) ఖాళీగా ఉన్నాయి. 36 అపార్టుమెంట్లు అసంపూర్తిగా ఉన్నట్లు సమాచారం. 26 టవర్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పోచారం, గాజులరామారం, జవహర్‌నగర్‌లో ఉన్నాయి. మరో ఎనిమిది టవర్లు ఖమ్మం పట్టణంలో ఉన్నాయి.
Also Read :Mohini Dey : ఏఆర్ రెహమాన్ నాకు తండ్రి లాంటివారు : మోహిని దే.. ఈమె ఎవరు ?
అసంపూర్తి ఇళ్లు, ఖాళీ ప్లాట్లు మొత్తం 1,700కుపైనే ఉన్నాయి. వీటిలో 1300కుపైగా నిజామాబాద్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, నల్గొండ, జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్‌లలో ఉన్నాయి. అసంపూర్తి ఇళ్లు, ఖాళీ ప్లాట్లు 300కుపైగా మేడ్చల్-రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నాయి.దాదాపు 136 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 65 ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో, 53 ఎకరాలు మేడ్చల్-మల్కాజిగిరిలో, 18 ఎకరాల చొప్పున ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో ఉంది. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి ప్రభుత్వం రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఇళ్లను నిర్మించడంతో పాటు ప్లాట్లను విక్రయించాలని ఆనాడు నిర్ణయించారు. అందుకోసం నాటి రాష్ట్ర ప్రభుత్వం భూములను బదలాయించింది.