తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘తెలంగాణ విజన్-2047’ డాక్యుమెంట్, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచపటంలో అత్యున్నత స్థానంలో నిలపడానికి రూపొందించిన ఒక బృహత్తర ప్రణాళిక. దేశంలోనే కాదు, ప్రపంచంలోని పది అగ్రగామి ఆవిష్కరణలకు, పెట్టుబడులకు, మరియు అత్యుత్తమ జీవన ప్రమాణాలకు కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్నది ఈ విజన్ ప్రధాన లక్ష్యం. కోర్ అర్బన్ రీజియన్‌పై దృష్టి సారించిన ఈ ప్రణాళిక, ప్రధానంగా ఐదు కీలక స్తంభాలపై ఆధారపడి ఉంది. మొబిలిటీ (రవాణా), పారిశ్రామిక అభివృద్ధి, వారసత్వ సంపద, పౌర సౌకర్యాలు, మరియు పర్యావరణ పరిరక్షణ. ఇందులో భాగంగా, నగర భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సమీకృత రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు. మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ సర్వీసులను అనుసంధానించడానికి కామన్ మొబిలిటీ కార్డును తీసుకురానున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రత్యేక మార్గాల్లో బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (బీఆర్‌టీఎస్) ను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా, ప్రజారవాణా మార్గాల నుంచి 15 నిమిషాల్లో చేరుకునే దూరంలో నిర్మించే కార్యాలయాలు, నివాసాలకు ప్రోత్సాహం అందించడం ద్వారా రవాణా ఆధారిత అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
Gannavaram : బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
ఈ విజన్‌లో పౌర సౌకర్యాలు మరియు జీవన ప్రమాణాల మెరుగుదలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి హైదరాబాద్‌లో 1,000 కి.మీ. వాకింగ్, సైక్లింగ్ కారిడార్లను నిర్మించనున్నారు. అలాగే నగరవ్యాప్తంగా 1500 కి.మీ. మేర ‘పీపుల్ ఫస్ట్ కారిడార్ల’ను ఏర్పాటు చేసి, ట్రాఫిక్ రద్దీ లేని సురక్షితమైన వీధులను రూపొందించనున్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా, ఓఆర్‌ఆర్ లోపల ఉన్న పారిశ్రామిక భూములను బహుళ వినియోగానికి అనువుగా అభివృద్ధి చేయడానికి బ్లౌన్‌ఫీల్డ్ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించనున్నారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడానికి, పాతబస్తీకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ హోదా సాధించడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. నైట్ ఎకానమీని పెంచడానికి, సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్స్, జలాశయాల వద్ద, మరియు ఐటీ కారిడార్లలో 24 గంటలు పనిచేసే హ్యాకర్స్ సెంటర్స్ 2.0 మరియు ఆధునిక మార్కెట్లను ఏర్పాటు చేయనున్నారు.
పర్యావరణ స్థిరత్వం మరియు నీలి-ఆకుపచ్చ (బ్లూ-గ్రీన్) అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, బ్లూ-గ్రీన్ హైదరాబాద్-2047 పేరుతో ప్రత్యేక ప్రణాళికను అమలు చేయనున్నారు. దీనిలో అత్యంత ముఖ్యమైన భాగం మూసీ నదిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతూ మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి చేపట్టడం. ఇందులో 35-40 కి.మీ. పొడవునా నడక మార్గాలు, వాటర్ ట్యాక్సీ డాక్స్, మరియు సుందరీకరణ పనులు ఉంటాయి. 100 చెరువులను సుందరీకరించడంతో పాటు, హుస్సేన్‌సాగర్ 2.0 ద్వారా దానిని మరింత అభివృద్ధి చేస్తారు. నగరంలో పచ్చదనాన్ని పెంచడానికి 1500 కి.మీ. అర్బన్ ఫారెస్ట్ బ్లాక్స్, స్ట్రీట్ కనోపీ, మరియు నడక మార్గాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విజన్‌లో అత్యంత కీలకమైన పౌర సౌకర్యాల లక్ష్యం ఏమిటంటే.. హైదరాబాద్ ప్రజలకు 24 గంటలూ తాగునీరు సరఫరా చేసే బృహత్తర లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఈ ఐదు స్తంభాల ఆధారంగా హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి మెగా సిటీగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.
