Site icon HashtagU Telugu

Women’s Day : మహిళా దినోత్సవం రోజున కొత్త పథకాలకు శ్రీకారం: మంత్రి సీతక్క

Minister Seethakka

Minister Seethakka

Women’s Day : మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మహిళా దినోత్సవం నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మహిళా దినోత్సవం రోజున కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో సుమారు లక్ష మంది మహిళలతో సభ నిర్వహిస్తామన్నారు. ఈ సభలో ఇందిరా మహిళా శక్తి పాలసీని సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేస్తారని చెప్పారు. మహిళా సంఘాల కోసం 32 జిల్లాల్లో 64 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను సీఎం వర్చువల్ గా ప్రారంభిస్తారన్నారు.

Read Also: Porn Sites Vs Bank Accounts: అశ్లీల సైట్ల పేరుతో స్కామ్.. బ్యాంకు అకౌంట్లు గుల్ల

వడ్డీలేని రుణాల చెక్కులను సీఎం పంపిణీ చేస్తారని తెలిపారు. ఏడాది కాలంలో ప్రమాదవశాత్తూ మరణించిన 400 మంది మహిళలకు రూ.40 కోట్ల బీమా చెక్కులను సీఎం రేవంత్‌ ఇవ్వనున్నట్లు సీతక్క వివరించారు. పట్టణాల్లో మహిళా సంఘాలను బలోపేతానికి సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని.. సెర్ప్, మెప్మాల‌ను ఒకే గొడుగు కింద‌కు తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి చెప్పారు. నారాయణపేట జిల్లా మాదిరిగా మిగతా 31జిల్లాల్లోనూ పూర్తిగా మహిళలే పెట్రోలు బంకులు నిర్వహించేలా చమురు సంస్థలతో ఆ రోజున ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని సీతక్క చెప్పారు.

అంతేకాక.. మహిళా స్వయం సహాయక బృందాలచే బస్సుల కొనుగోలు చేయించడమే కాక, ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఒప్పందాలను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. అందులో భాగంగా మొదటి విడతలో 50 ఆర్టీసి అద్దె బస్సులకు పచ్చ జెండా ఊపి సీఎం ప్రారంభించనున్నారు. కాగా, లక్ష మంది మహిళలతో మహిళా దినోత్సవ సభను నిర్వహిస్తుండగా, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిధిగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు హాజరుకానున్నారు.

Read Also: Posani : ఛాతి నొప్పి అని పోసాని డ్రామా : సీఐ వెంకటేశ్వర్లు