DCC Presidents: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రెండో రోజు ఢిల్లీ పర్యటనలో రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC Presidents) అధ్యక్షుల నియామకంపై పార్టీ హైకమాండ్‌తో కీలక చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు.
డీసీసీ అధ్యక్షుల ఎంపికకు సంబంధించి ఏఐసీసీ అబ్జర్వర్లు రాష్ట్ర నాయకత్వానికి నివేదికను సమర్పించారు. అబ్జర్వర్లు జిల్లాల్లో పర్యటించి, పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించినట్లు సమాచారం. డీసీసీ అధ్యక్ష పదవి కోసం జిల్లాల నుంచి భారీగా పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క జిల్లా నుంచి 15 నుంచి 30 మంది ఆశావాహులు పోటీలో ఉన్నారని సమాచారం. రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఆరుగురు పేర్లను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
కేసీ వేణుగోపాల్‌తో జరిగిన సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ ప్రెసిడెంట్ తమ అభిప్రాయాలను హైకమాండ్‌కు తెలియజేశారు. ఈ నియామకాలు సామాజిక సమీకరణల ఆధారంగా ఉంటాయని పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ బలోపేతం, పార్టీ పట్ల విధేయత చూపిన వారికి అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్‌ఎస్ కథ పరిసమాప్తం అంటున్న మంత్రులు!
డీసీసీ అధ్యక్ష పదవుల కోసం ఆసక్తి చూపుతున్న నాయకులలో ప్రచారంలో ఉన్న కొన్ని నిబంధనలు నిరాశను కలిగిస్తున్నాయి. పార్టీలో కనీసం ఐదు సంవత్సరాల నుంచి ఉన్నవారికి మాత్రమే పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా గతంలో పదవులు అనుభవించిన వారికి మళ్లీ అవకాశం ఉండదనే నిబంధనలు ఆశావాహులలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌తో తెలంగాణలో ‘సంగఠన్ సృజన్ అభియాన్’ పురోగతిపై, కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకంపై చర్చించినట్లు తెలిపారు.
కాగా.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కుమారుడి బారసాల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం అనంతరం ఆయన తన ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.
