New Revenue Act : ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ‘భూ దస్త్రాలు, యాజమాన్య హక్కుల చట్టం-2024 ’పేరుతో నూతన రెవెన్యూ చట్టం బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే.. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్వోఆర్-2020 రద్దవుతుంది. పట్టా భూముల యజమానులకు, ప్రభుత్వ భూములకు భద్రత కల్పించేందుకు కొత్త చట్టంలో కొన్ని భద్రతాపరమైన సెక్షన్లను చేర్చారు. ధరణి పోర్టల్ పేరును భూమాతగా మార్చనున్నారు. కొత్త చట్టం ద్వారా భూ సమస్యలను తహసీల్దారు, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చు. డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయిలో ల్యాండ్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తారు.
Also Read :Vastu Tips: ఈ వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయా? అయితే సమస్యలే!
నూతన చట్టంలోని ముఖ్యాంశాలు
- సుమోటోగా సమీక్ష చేసే అధికార రాష్ట్ర ప్రభుత్వానికి లభిస్తుంది. ఏవైనా భూములకు లేదా భూ యజమానులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను లేదా సక్రమం కాని భూముల రికార్డులపై సమీక్ష చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈక్రమంలో సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపి, వివరణ తీసుకుంటారు.
- ఇంతకుముందు వారసత్వ భూముల బదిలీ(New Revenue Act)వెంటనే జరిగిపోయేది. ఇకపై అలా ఉండదు. వారసత్వ భూముల బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తరువాత కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేస్తారు. స్పందించేందుకు వారికి కొంత సమయం ఇస్తారు. ఆ తర్వాతే వారసత్వ భూముల బదిలీ ప్రక్రియను నిర్వహిస్తారు.
- తహసీల్దారు జారీ చేసే భూముల డాక్యుమెంట్లపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆర్డీవోకు అప్పీల్ చేయడానికి 60 రోజుల టైం ఇస్తారు. ఆర్డీవో ఇచ్చే డాక్యుమెంట్లపై అభ్యంతరాలు ఉంటే కలెక్టర్‌కు అప్పీల్ చేయడానికి 60 రోజుల టైం ఇస్తారు.
- భూముల మ్యుటేషన్‌కు సంబంధించిన అధికారాలు ఆర్డీవోల పరిధిలోకి వస్తాయి. మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసే టైంలోనే భూమి సర్వే సబ్ డివిజన్ పటాన్ని జతపర్చాలి. నిర్దిష్ట గడువులోగా మ్యుటేషన్ ప్రక్రియను ఆర్డీవో పూర్తి చేయాలి.
- ప్రతి భూ కమతానికి భూధార్ సంఖ్యను కేటాయిస్తారు. ఈ విధానంలో భూమి అవసరాలను బట్టి తాత్కాలిక భూాఆధార్ సంఖ్యను, శాశ్వత భూఆధార్ సంఖ్యను కేటాయిస్తారు. భూములకు పక్కాగా హద్దులు నిర్ధారిస్తారు.
- గ్రామ కంఠం పరిధిలోని నివాస స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పిస్తారు. వ్యవసాయేతర భూములకూ మ్యుటేషన్ చేసుకునే ఛాన్స్ ఇస్తారు.
- ప్రభుత్వ భూములకు పట్టాపాసుపుస్తకాలు జారీ అయితే రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఉంటుంది. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు ఉంటాయి.