Site icon HashtagU Telugu

NEET Paper Leak : ఈడీ ఏం చేస్తోంది.. ‘నీట్’‌పై ఎందుకు స్పందించడం లేదు : వినోద్‌కుమార్

Brs Ex Mp Vinod Kumar Comme

NEET Paper Leak : నీట్ పేపర్ లీక్‌ వ్యవహారంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘‘బిహార్, గుజరాత్ రాష్ట్రాలు కేంద్రంగా నీట్ ప్రశ్న పత్రం లీకైందని వార్తలు వస్తున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారాయని అంటున్నారు. అలాంటప్పుడు దీనిపై ఈడీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదు’’ అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. ‘‘సాధారణంగానైతే కోట్లాది రూపాయలు చేతులు మారితే ఈడీ వెంటనే కేసులు నమోదు చేస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు కేసు నమోదు  చెయ్యలేదు’’ అని ఆయన నిలదీశారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘తెలంగాణ రాష్ట్రం నుంచి చాలామంది పిల్లలు నీట్ పరీక్ష రాశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రొఫెసర్లతో నేను మాట్లాడాను. నీట్ ద్వారా మన రాష్ట్రానికి లాభం జరిగిందా లేదా అన్నది చర్చించాను. 2015 సంవత్సరం నుంచి నీట్ పరీక్ష మన విద్యార్థులు రాస్తున్నారు. వారిలో 15 శాతం మంది మాత్రమే ఆల్ ఇండియా కోటాకు ఎంపికవుతున్నారు’’ అని వినోద్ కుమార్ (NEET Paper Leak) పేర్కొన్నారు.  నీట్ పరీక్షలో సీటు వచ్చినా వేరే రాష్ట్రాలకు చాలామంది తెలంగాణ విద్యార్థులు వెళ్లడం లేదన్నారు.  ‘‘తెలంగాణ రాష్ట్రంలో 25 మెడికల్ కాలేజీలు ఉన్నాయి.. మరికొన్ని మెడికల్ కాలేజీలు వచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రిని నేను ఒక్కటే కోరుతున్న. నీట్ పరీక్షతో తెలంగాణ విద్యార్థులకు లాభం జరుగుతుందా ? నష్టం జరుగుతుందా ? అనేది గుర్తించేందుకు నిపుణుల కమిటీని నియమించాలి’’ అని వినోద్ కుమార్  పేర్కొన్నారు. ‘‘మన రాష్ట్రంలో మంచి నిపుణులు ఉన్నారు. వారితో నీట్ పరీక్షపై అధ్యయనం చేయించాలి.  రాష్ట్రాల వారీగా నీట్ పరీక్ష నిర్వహించాలని తమిళనాడులో విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు. మనం కూడా అదే బాటలో ముందుకు వెళ్దాం’’ అని ఆయన పిలుపునిచ్చారు.

Also Read :MLC By Poll : ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బైపోల్.. జులై 12న పోలింగ్