Jubliee Hills: జూబ్లీహిల్స్ నియోజకవర్గ (Jubliee Hills) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించారు. తన సమీప ప్రత్యర్థి, భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి సునీతపై ఏకంగా 25 వేల ఓట్లకుపైగా భారీ మెజార్టీతో ఆయన జయకేతనం ఎగురవేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం చరిత్రలో ఇంతటి మెజార్టీ సాధించడం ఇదే ప్రథమం కావడం విశేషం.
స్పష్టమైన ఆధిక్యం, పరాజయం లేని పయనం
ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైన తొలి రౌండ్ నుంచే నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు. ప్రతి రౌండ్ పూర్తయ్యేసరికి ఆయన మెజార్టీ మరింత పెరుగుతూ పోయింది. BRS అభ్యర్థి మాగంటి సునీత ఏ ఒక్క రౌండ్‌లోనూ ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. ఇది BRSకు గట్టి ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. భారత రాష్ట్ర సమితి, బీజేపీ అభ్యర్థులకు 2023 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే తక్కువ ఓట్లు రావడం గమనార్హం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంతైంది.
Also Read: Jubilee Hills Byelection Counting : 20 వేలు దాటిన కాంగ్రెస్ మెజార్టీ
సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహమే విజయం రహస్యం
ఈ చారిత్రక విజయం వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యూహాత్మక పర్యవేక్షణ ప్రధాన పాత్ర పోషించింది. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ప్రచార సరళి వరకు ఆయన ప్రతీ అంశాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. విజయాన్ని సులభతరం చేసేందుకు, పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు అజారుద్దీన్‌కు మంత్రి పదవిని కట్టబెట్టడం మైనార్టీ వర్గాల్లో కాంగ్రెస్ పట్టును మరింత పెంచడానికి దోహదపడింది. అంతేకాక డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేయడంతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో సీఎం తీసుకున్న చర్యలు కూడా విజయాన్ని ప్రభావితం చేశాయి.
ఓటములను మెట్లుగా చేసుకున్న నవీన్ యాదవ్
నవీన్ యాదవ్ రాజకీయ ప్రస్థానం ఓటములతో కూడిన అనుభవాల నుంచి వచ్చింది. 2009లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్‌గా MIM నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో MIM తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 41,656 ఓట్లు (25.19%) సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2015లో రహ్మత్‌నగర్ కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18,817 ఓట్లు సాధించారు.
సుదీర్ఘ కాలం పాటు ఓటములను ఎదుర్కొన్న నవీన్ యాదవ్.. చివరకు 2023 నవంబరు 15న నాటి పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి, ఇప్పుడు అదే పార్టీ తరఫున ఘన విజయం సాధించడం విశేషం. ఈ గెలుపు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీ శ్రేణులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. అధికారికంగా ఈసీ ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగిరింది.
