CM Revanth: తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడంలో నల్గొండ జిల్లా ముందంజలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) తెలిపారు. గంధంవారిగూడెం సభలో మాట్లాడుతూ.. ఈ జిల్లా గాలి పిల్చితే సాయుధ పోరాటం గుర్తుకొస్తుందన్నారు. వైఎస్‌ఆర్ ప్రారంభించిన SLBC టన్నెల్‌ను గత ప్రభుత్వం పూర్తి చేయలేదని విమర్శించారు. ఉమ్మడి పాలనలో కంటే ఎక్కువగా కేసీఆర్ పాలనలోనే నల్గొండ జిల్లాకు అన్యాయం, నష్టం జరిగిందని పేర్కొన్నారు.
అసెంబ్లీకి రాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు చేశారు. ఓటమి తర్వాత ఫామ్‌హౌస్‌కు పరిమితమవ్వడం సరికాదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ప్రతిపక్ష నేత పాత్ర పోషించారా అని ప్రశ్నించారు. కానీ, ఆయన వదిలిన గాలి బ్యాచ్ ప్రభుత్వం చేసే అభివృద్ధిని అడ్డుకుంటోందని మండిపడ్డారు. దీనిపై కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
వరి వేస్తే.. ఉరేసుకున్నట్లే అని గతంలో కేసీఆర్ అన్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘‘మా హయాంలో వరికి మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తున్నాం. గతంలో ఎమ్మెల్యేలను లాక్కున్నా.. వెనకడుగు వేయకుండా పోరాడాం. ఒక్కసారి ఓడిపోగానే కుంగిపోయి ఫామ్‌హౌస్‌కి పోవడం కేసీఆర్ స్థాయికి తగదు. గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ప్రజల్లో ఉండి ఎంపీగా గెలిచా’’ అని సీఎం చెప్పుకొచ్చారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. జూన్ 2, 2014 కు ఎంత ప్రాధాన్యత ఉందో డిసెంబర్ 7, 2024కు అంతే ప్రాధాన్యత ఉందని అన్నారు. నల్లగొండ జిల్లా పోరాటాల పురిటిగడ్డ అని, తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం పదవీ త్యాగం చేశారు. తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసిన శ్రీకాంతాచారిది నల్లగొండ గడ్డనే. మలిదశ ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ కోసం మంత్రి పదవికి త్యాగం చేసి.. మళ్లీ ఇందిరమ్మ రాజ్యంలో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో నల్లగొండ జిల్లా పాత్ర మరువలేనిది. నల్లగొండలో అడుగు పెట్టగానే ఆనాటి సాయుధ పోరాటం గుర్తొస్తుంది. ఈ నేల గాలి పీల్చగానే నిజాంను గడ గడలాడించిన చరిత్ర కళ్లముందు కదులుతుంది. మల్లు స్వరాజ్యం, రావి నారాయణ రెడ్డి , ధర్మబిక్షం లాంటి నాయకులు ఎంతో మంది ఈ గడ్డ నుంచి పోరాట స్ఫూర్తి నింపారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఎస్ఎల్బీసీ, ఉదయ సముద్రం ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. నల్లగొండను ఫ్లోరైడ్ మహమ్మారి నుంచి విముక్తి కలిగించాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని తెలిపారు.