Ramachander Rao : తెలంగాణ బీజేపీకి కొత్త నాయకత్వం లభించింది. సీనియర్ నేత, బీజేపీ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఎన్. రామచందర్ రావు శనివారం రాష్ట్ర అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణతో పాటు పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభమైన వెంటనే నేతలు రామచందర్ రావును గజమాలతో సత్కరించడంతో పాటు, పుష్ప గుచ్ఛాలతో అభినందనలు తెలిపారు. నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు నాయకులు భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి ఆయన నాయకత్వం ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: Jharkhand : ఝార్ఖండ్ బొగ్గుగనిలో ప్రమాదం.. చిక్కుకుపోయిన పలువురు కార్మికులు
ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ..పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, యువతను ఆకర్షించడం, గ్రామీణ స్థాయిలో బలమైన నిర్మాణం కల్పించడం ప్రధాన లక్ష్యాలు కావాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ మద్దతును పెంచడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన తెలిపారు. అంతకుముందు ఉదయం, రామచందర్ రావు తన నివాసం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీలో బయలుదేరారు. విజయ్ రథం మాదిరిగా అలంకరించిన వాహనంపై ఆయన ప్రయాణించారు. మార్గమధ్యంలో ఆయనకు కార్యకర్తలు పూలతో స్వాగతం పలికారు. ర్యాలీ మొదలుపెట్టే ముందు ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని సరస్వతీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. పూజల అనంతరం ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు తాను కృషి చేస్తానని అన్నారు. ఈ పరిణామంతో బీజేపీ తెలంగాణ శాఖలో కొత్త ఉత్సాహం నెలకొంది. గత ఎన్నికల్లో బలహీనంగా వ్యవహరించిన పార్టీ, రాబోయే స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, అలాగే 2029 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కొత్త అధ్యక్షుడి నాయకత్వంలో పునర్నిర్మాణ లక్ష్యంతో ముందుకు సాగనుంది. ఎన్. రామచందర్ రావు న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు. ఆయనకు పార్టీ కార్యాచరణలపై పట్టు ఉండటంతో, ఇది బీజేపీకి ఒక బలమైన మార్గదర్శనం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.