తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By Election) పై ఫోకస్ నడుస్తుంది. మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ ఉప ఎన్నిక ను కాంగ్రెస్ , బిఆర్ఎస్ , బిజెపి లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ మూడు పార్టీలే కాదు తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) సైతం కొత్త పార్టీ తో జూబ్లీ హిల్స్ బరిలోకి దిగాలని చూస్తున్నారు..అటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) సైతం పోటీ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇటు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య సునీతను బరిలోకి దింపేందుకు సన్నాహాకాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని డివిజన్ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వరుసగా సమావేశమవుతూ.. వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక అధికార పార్టీ కాంగ్రెస్..మైనంపల్లి హన్మంతరావు ను బరిలోకి దింపుతున్నట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు అంజన్ కుమార్ యాదవ్, దానం నాగేందర్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, నవీన్ యాదవ్ తదితర నేతల పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా మాత్రం అధిష్టానం మైనం పల్లి కి మొగ్గు చూపించినట్లు తెలుస్తుంది.
Bathukamma: కనివినీ ఎరుగని రీతిలో బతుకమ్మ సంబరాలు!
తెలంగాణ రాజకీయాల్లో మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumanth Rao) ఒక కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రారంభంలో స్థానిక స్థాయి నాయకుడిగా ప్రజలకు చేరువైన ఆయన, తన బలమైన ఓటు బ్యాంక్‌తో రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ప్రాధాన్యం సంపాదించారు. ముఖ్యంగా మెదక్, మల్కాజిగిరి పరిసర ప్రాంతాల్లో ఆయనకు గట్టి అనుచరగణం ఉంది. తన రాజకీయ జీవితంలో మైనంపల్లి అనేకసార్లు పార్టీలు మార్చినప్పటికీ, ఎక్కడ ఉన్నా తన వ్యక్తిగత బలాన్ని నిలబెట్టుకున్నాడు. ఏ పార్టీకి వెళ్లినా గెలుపు అవకాశాలు పెంచగల నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారు.
ప్రజలకు సులభంగా చేరువవడం, వారి సమస్యలను స్వయంగా వినడం ఆయన రాజకీయ శైలిగా మారింది. ప్రజలతో నేరుగా మమేకమై ఉండటం వల్లే మైనంపల్లి తన రాజకీయ బలాన్ని నిలబెట్టుకున్నారని అనుచరులు భావిస్తున్నారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రతిష్టాత్మక సీటుగా పరిగణించబడుతుంది. ఈసారి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మైనంపల్లి హన్మంతురావు బరిలోకి దిగుతారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాదు జిల్లా అధ్యక్షుడిగా ఆయన జిహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 99 కార్పొరేటర్ సీట్లు సాధించడం ద్వారా తన నాయకత్వాన్ని నిరూపించారు.
ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించడంలో మైనంపల్లి కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా తన కుమారుడు రోహిత్‌ను మెదక్ నుంచి గెలిపించడం ద్వారా ఆయన స్ట్రాటజిక్ లీడర్‌గా మళ్లీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నుంచి ఆయన పోటీ చేస్తే కాంగ్రెస్ గెలుపు మరింత ఖాయమవుతుందని పీసీసీ అంచనా వేస్తోంది.
మైనంపల్లి జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి దిగితే, ఆయనకు కేబినెట్ బర్త్ కూడా ఖాయమని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీకి గెలుపు తెచ్చే నేతగా ఆయనను కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో జూబ్లీహిల్స్ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారింది. మైనంపల్లి ఎంట్రీతో కాంగ్రెస్ విజయం ఖాయమవుతుందా అన్న ప్రశ్న ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.