Mulugu Encounter Case : ఇటీవలే ములుగు జిల్లా ఏటూరునాగారంలోని చల్పాక అడవుల్లో జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్ కేసును తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారించింది. ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల మృతదేహాలకు సరిగ్గా పోస్టుమార్టం నిర్వహించలేదంటూ మావోయిస్టు మల్లయ్య భార్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘‘పోస్టుమార్టం చీకటిలో నిర్వహించారు. పంచనామా ప్రక్రియ సరిగ్గా జరగలేదు. రీపోస్టుమార్టం చేసేలా ఆదేశాలు ఇవ్వండి’’ అని ఆయన కోర్టును కోరారు. ‘‘మావోయిస్టులకు తొలుత భోజనంలో విషం కలిపి ఇచ్చారు. అనంతరం కస్టడీలోకి తీసుకుని కాల్చిచంపారు’’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపించారు.
Also Read :Chinmoy Krishna Das : చిన్మయ్ కృష్ణదాస్‌ను ఏకాకి చేసే యత్నం.. వాదించేందుకు ముందుకురాని లాయర్లు
ఎనిమిది మంది వైద్య నిపుణులతో మావోయిస్టుల(Mulugu Encounter Case) డెడ్‌బాడీలకు పంచనామా చేయించామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ‘‘ఇది బూటకపు ఎన్‌కౌంటర్ కాదు. ఆహారంలో ఎలాంటి విషం ఇవ్వలేదు. ఎన్‌హెచ్‌ఆర్సీ గైడ్‌లెన్స్ ప్రకారం పోస్టుమార్టం నిర్వహించాం’’ అని ఆయన చెప్పారు. ఎన్‌కౌంటర్ ఎలా జరిగింది ? ఆ వెంటనే ఏమేం చేశారు ? పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో ఏముంది ? అనే వివరాలను తమకు సమర్పించాలని ఈసందర్భంగా పోలీసులను హైకోర్టు ఆదేశించింది. చనిపోయిన వారిలో మల్లయ్య మృతదేహం తప్ప మిగితా అందరి మృతదేహాలను వారివారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని న్యాయస్థానం పోలీసులకు నిర్దేశించింది. మల్లయ్య డెడ్‌బాడీని గురువారం(డిసెంబర్ 5) వరకు భద్రపర్చాలని నిర్దేశించింది.
Also Read :Minister: ఆర్ధిక ఇబ్బందులతో ఏ ఒక్కరి చదువు ఆగిపోవద్దు: మంత్రి
అయితే మావోయిస్టు మల్లయ్య మృత దేహాన్ని భద్రపర్చడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ అంశంపై తదుపరి విచారణను గురువారానికి హైకోర్టు వాయిదా వేసింది. గురువారం రోజు రాష్ట్ర ప్రభుత్వం నివేదికను ఇచ్చిన తరువాత తదుపరి చర్యలపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. పిటిషనర్‌గా మల్లయ్య భార్య ఉన్నందున ఆయన మృతదేహాన్ని భద్రపర్చాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కాగా, అంతకుముందు రోజు (సోమవారం) కూడా హైకోర్టులో ఇదే పిటిషన్‌పై విచారణ జరిగింది. మావోయిస్టుల డెడ్‌బాడీస్‌ను మంగళవారం వరకు భద్రపర్చాలని సోమవారం రోజు హైకోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.