Mohan Babu : సినీ నటుడు మోహన్‌బాబు పోలీసుల నోటీసులపై తనకు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. విచారణ జరిపిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం పోలీసుల ముందు విచారణ నుంచి మినహాయింపు ఇచ్చింది. విచారణ జరిపిన హైకోర్టు జర్నలిస్టులకు మోహన్ బాబు ఇంట్లో ఏం పని అని ప్రశ్నించింది. వాదోపవాదాల తర్వతా డిసెంబర్ 24 వరకు మోహన్ బాబు పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల ముందు విచారణకు నుంచి మినహాయింపు ఇస్తూ.. విచారణ ఈనెల 24కి వాయిదా వేసింది.
ప్రస్తుతం మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో కోర్టు పోలీసుల ముందు హాజరు నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, మనోజ్ సీపీ కార్యాలయంలో హాజరయ్యి.. శాంతిభద్రతల సమస్య సృష్టించబోనని లక్ష రూపాయలకు బాండ్ సమర్పించారు. మంచు విష్ణు నోటీసులు తనకు ఉదయమే అందాయని అయితే పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం తనకు లేదన్నారు. కానీ వ్యవస్థలను గౌరవించి హాజరవుతానని చెప్పుకొచ్చారు.
కాగా, మోహన్‌బాబు తన కుమారుడు మనోజ్ మధ్య తలెత్తిన వివాదం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుల వరకు వెళ్లింది. దీంతో మనోజ్, మోహన్‌బాబు పరస్పరం ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో విచారణ కోసం పోలీసులు మోహన్‌బాబు, మనోజ్‌కు వేర్వేరుగా నోటీసులు జారీచేశారు. మనోజ్ విచారణకు వెళ్లగా మోహన్‌బాబు మాత్రం హాజరుకాలేదు.