MLC Vijayashanti: “ఓట్ల చోరీ” ఆరోపణలు, ఎలక్షన్ కమిషన్ (EC) పనితీరుపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రాహుల్ గాంధీకి సవాలు విసురుతూ “ఓట్ల చోరీపై ఆధారాలు చూపండి, లేకపోతే క్షమాపణ చెప్పండి” అని చేసిన వ్యాఖ్యలు ఒక రాజ్యాంగ సంస్థ ప్రతినిధిగా కాకుండా బీజేపీ అధికార ప్రతినిధిలా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ, దేశంలోని ప్రజలు భావిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి (MLC Vijayashanti) పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ పనితీరుపై ప్రజల్లో ఉన్న అనుమానాలను ప్రస్తావించారని, ఓట్ల చోరీపై తన వద్ద ఉన్న ఆధారాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారని ఆమె గుర్తుచేశారు. రాహుల్ గాంధీ చెప్పిన వివరాల్లో వాస్తవాలు ఉంటే వాటిని పరిశీలించి దొంగ ఓట్లను తొలగించి, ఓట్ల చోరీని నిరోధించడం ఎన్నికల కమిషన్ బాధ్యత అని విజయశాంతి అన్నారు. అయితే ఈసీ తన అసలు పనిని విస్మరించి, బీజేపీ నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ రాజకీయ నాయకుడిలా వ్యవహరించారని ఆమె ఆరోపించారు.
Also Read: Coolie Collection: బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న కూలీ.. నాలుగు రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
“వంద మంది దోషులు తప్పించుకోవచ్చు. కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు” అనే ప్రాథమిక రాజ్యాంగ సూత్రానికి అనుగుణంగా, వేలాది దొంగ ఓట్లను తొలగించవచ్చు కానీ ఒక అసలైన ఓటరు పేరును తొలగించి పౌరుడి ప్రాథమిక హక్కును కాలరాయడం రాజ్యాంగ విరుద్ధమని రాహుల్ గాంధీ పోరాడుతున్నారని విజయశాంతి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ వాదనలో విశ్వసనీయత ఉందని, అందుకే ఈసీ సమాధానం చెప్పకుండా రాజకీయ సవాలు విసిరిందని ఆమె పేర్కొన్నారు.
ఎలక్షన్ కమిషన్ మోదీ ప్రభుత్వానికి తొత్తుగా మారిందన్న ఆరోపణలు రావడం వల్లే 2023 మార్చిలో సుప్రీం కోర్టు ఒక చారిత్రక తీర్పును ఇచ్చిందని ఆమె గుర్తుచేశారు. ఈసీ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పని చేయడానికి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేదా ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి ఒక కమిటీని నియమించాలని, ఆ కమిటీలో ప్రతిపక్ష నేతకు కూడా స్థానం కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని ఆమె తెలిపారు. ప్రస్తుత సీఈసీ వైఖరిని చూస్తుంటే సుప్రీం కోర్టు ఎందుకు అలాంటి తీర్పు ఇచ్చిందో అర్థమవుతోందని విజయశాంతి వ్యాఖ్యానించారు.
బీహార్‌లో ఓటర్ల జాబితా పరిశీలన
నిజానికి, బీహార్‌లో ఓట్ల తొలగింపుపై సుప్రీం కోర్టులో ఇటీవల దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తులు, ఓట్ల తొలగింపుపై పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని ఈసీని ఆదేశించారు. ఈ ఆదేశాలతో ఉలిక్కిపడ్డ ఈసీ డామేజ్ కంట్రోల్‌లో భాగంగా, బీహార్‌లో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లను పరిశీలించి తిరిగి జాబితాలో చేర్చడానికి సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయని విజయశాంతి తెలిపారు. ఒకవేళ ఇది జరిగితే, రాహుల్ గాంధీ పోరాటం వల్ల ఓటు హక్కు కోల్పోయినవారు తిరిగి తమ హక్కును పొందే అవకాశం ఏర్పడుతుందని ఆమె అన్నారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తుంటే, “offensive is the best way of defence” అన్న చందంగా, తమ తప్పును రాహుల్ గాంధీపై నెట్టేసి తప్పించుకోవాలని ఈసీ ప్రయత్నిస్తోందని విజయశాంతి ఆరోపించారు. అవసరమైతే, ఐఎన్‌డీఐ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి సీఈసీ నిజస్వరూపాన్ని బయట పెట్టే అవకాశం కూడా లేకపోలేదని ఆమె పేర్కొన్నారు.