MLC Kavitha: విభజించి పాలించుతో బిజెపి ఓట్లు దండుకునే ప్రయత్నం: ఎమ్మెల్సీ కవిత

విభజించు పాలించు ఉన్న సిద్ధాంతాన్ని అవలంబిస్తూ బీజేపీ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నదని కల్వకుంట్ల కవిత విమర్శించారు.

  • Written By:
  • Publish Date - August 5, 2023 / 05:49 PM IST

హైదరాబాద్ : విభజించు పాలించు ఉన్న సిద్ధాంతాన్ని అవలంబిస్తూ భారతీయ జనతా పార్టీ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బ్రిటిష్ వారు మొదలుపెట్టిన విభజించు పాలించు అన్న సిద్ధాంతాన్ని ఇప్పుడు బిజెపి పాటిస్తోందని ధ్వజమెత్తారు. మణిపూర్ లో జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండించారు. మణిపూర్ లో ప్రభుత్వ ప్రాయోజిత హింస జరుగుతుందని ఆరోపించారు. శనివారం రోజున శాసన మండలిలో గిరిజనుల స్థితిగతులపై జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొని కవిత మాట్లాడారు.

మణిపూర్ లో జరుగుతున్న పరిణామాలపై కల్వంకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ ఘటనలను ఈ దేశ గిరిజనులపై ప్రభుత్వ ప్రయోజిత హింసగా అభివర్ణించారు. రెండు గిరిజన తెగల మధ్య కొట్లాట పెట్టించి మొత్తం యంత్రాంగం నిలబడి చూసుకుంటూ ఉన్న పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా దారుణమని, దీన్ని అందరూ ఖండించాలని స్పష్టం చేశారు. అన్ని జాతులు బాగుపడాలని మనం కోరుకుంటుంటే…. విభజించి పాలించి ఓట్లు దండుకోవాలన్న ప్రయత్నం కేంద్రంలో కనిపిస్తోందని స్పష్టం చేశారు. విభజించు పాలించు సిద్ధాంతాన్ని బ్రిటీష్ వాళ్లు ప్రవేశపెట్టారని, ఇప్పుడు దాన్ని బీజేపీ వాళ్లు పాటిస్తున్నారని విమర్శించారు. ఐక్యతనే బీఆర్ఎస్ సిద్ధాంతమని తేల్చిచెప్పారు. ఇవాళ తెలంగాణ ఆలోచించేది రేపు దేశం అనుసరిస్తుందని మనం వందల కార్యక్రమాల్లో చూశామని, గిరిజన విషయంలోనూ అదే జరగబోతుందని తెలిపారు.

గిరిజనులకు కేటాయించిన నిధులను 100 శాతం వినియోగించేలా ప్రభుత్వం వ్యవస్థను రూపొందిస్తోందని తెలిపారు. తెలంగాణ ఏర్పడి తర్వాత ఎస్టీ జనాభా 9.5 శాతానికి పెరిగిందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 6 శాతం ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేసి ప్రభుత్వం కేంద్రానికి పంపించిందని చెప్పారు. గిరిజనులకు అటవీ హక్కుల చట్టం కల్పించిన హక్కులను గత ప్రభుత్వాల కాలరాస్తూ వచ్చాయని, అడవుల్లో పరిశ్రమలను ప్రోత్సహించాయని విమర్శించారు. భూములపై హక్కులు ఇవ్వాలంటూ అనేక మంది దరఖాస్తు చేశారని, వాటిని పరిశీలించిన తర్వాత లక్షా 50 వేల మంది గిరిజనులను 4 లక్షల 5 వేల ఎకరాలకు కేసీఆర్ సర్కార్ పట్టాలు ఇచ్చిందని వివరించారు. తక్షణమే వారికి రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలవుతాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గిరిజనులకు సెటిల్ చేసిన అటవీ విస్తీర్ణంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని ప్రకటించారు. రాష్ట్ర అడవుల్లో 10.6 శాతం మేర విస్తీర్ణాన్ని గిరిజనులకు ఇచ్చామని తెలిపారు.

ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలన్నది తమ నినాదమని, దాన్ని సీఎం కేసీఆర్ గుర్తించారు కాబట్టి ఆదివాసీ గూడేలను ప్రత్యేక గ్రామ పంచాయతీలు చేయడమే కాకుండా అన్ని రకాల పథకాలను వర్తింపజేస్తున్నారని వివరించారు. మొత్తం గిరిజన జనాభాలో లక్షా 57 మందికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ. 1336 కోట్ల వరకు అందజేశామని, 8 లక్షల 23 వేల మంది రైతులకు రైతు బంధు రూపంలో రూ. 9300 కోట్లు, ఆసరా పెన్షన్ల రూపంలో 3 లక్షల 53 వేల మందికి రూ. 4500 కోట్లు అందించామని, రెండు లక్షల 28 వేల మంది గిరిజన ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్ లను పంపిణీ చేశామని చెప్పారు. గిరిజనులు, ఆదివాసీలకు కచ్చితంగా విద్య అందాలని సీఎం కేసీఆర్ భావిస్తుంటారని, అందులో భాగంగా 175 విద్యా సంస్థలను ప్రత్యేకంగా ఆదివాసీలు, గిరిజనులకు ఏర్పాటు చేశారన్నారు. తెలుగు భాషను తప్పనిసరి చేస్తూనే పాఠశాలల్లో ఇంగ్లీషులో బోధిస్తున్నామని, ఒక్కో విద్యార్థి మీద రూ. లక్షా 25 వేలు ఖర్చు చేస్తున్నామని, మంచి ఫలితాలు వచ్చాయన్నారు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల్లో 367 మంది ఐఐటీ, ఐఐం సంస్థల్లో చేరారని, 456 మంది నిట్, ఐఐఐటీలో అడ్మిషన్లు సాధించారని, 2087 ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరారని, 266 మంది మెడికల్ కాలేజీల్లో ప్రవేశంపొందారని చెప్పారు. క్రీడల్లో కూడా వారికి కోచింగ్ ఇప్పించడం వల్ల ఆ రంగంలోనూ రాణిస్తున్నారని, నిజామాబాద్ జిల్లాకు చెందిన మాలావత్ పూర్ణ అత్యంత పిన్న వయస్సులో మౌంట్ ఎవరెస్టును అధిరోహించి ప్రపంచ రికార్డును సొంతం చేశారని ఉదాహరించారు. మమతా గుగులోత్ అంతర్జాతీయ స్థాయి ఫొటొగ్రఫి చేసి ఓగిటాలియా అనే మేగజైన్ లో కవర్ పేజీలో మె తీసిన ఫోటోను ప్రచురించిందన్నారు. గిరిజనులు పారిశ్రమికవేత్తలుగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ సాధికారత కల్పిస్తోందని, ఆదివాసీ ముద్దు బిడ్డ కొమ్రంభీమ్ జన్మించిన జోడేఘాట్ ను అభివృద్ది చేయడమే కాకుండా ఆసిఫాబాద్ జిల్లాలకు కొమ్రం భీమ్ పేరును పెట్టుకున్నామని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున రూ. 22 కోట్లతో ఆదివాసీ భవన్ ను ప్రభుత్వం నిర్మించిందని, సేవాలాల్ జయంతిని అధికారికంగా జరుపుతున్నామని గుర్తు చేశారు. గిరిజనుల అస్థిత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం గౌరవిస్తోందని, మా తండాల్లో మా రాజ్యం అన్న గిరిజనుల నిదానాన్ని సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో గిరిజనులను ఇన్ని మంచి పనులు చేస్తుంటే దేశవ్యాప్తంగా గిరిజనుల పరిస్థితిపై ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గిరిజన హక్కులను హరిస్తోందని విమర్శించారు. గ్రామ సభలు తీర్మానం చేసే హక్కును కూడా తొలగిస్తూ చట్ట సవరణ చేసే ప్రయత్నం చేశారని అన్నారు. అటవీ హక్కులను పూర్తిగా నిర్వీర్యం చేశారని, పెసా చట్టాన్ని చాలా పేవలంగా అమలు చేస్తున్నారని కాగ్ కూడా తేల్చిందని సభ దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణలో తప్పా మిగితా ఏ రాష్ట్రంలోనూ పెసా చట్టం సమర్థవంతంగా అమలు కావడం లేదన్నారు. గిరిజన సబ్ ప్లాన్ నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, పదేపదే కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు.

Also Read: Assembly Session: రాష్ట్ర వ్యాప్తంగా 284 కోట్ల మొక్కలు నాటాం: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి