Groundnut farmers : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వేరుశనగ రైతుల కష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వేరుశెనగ రైతుల ఆందోళనలు ఈ సర్కారుకు కనిపించడం లేదా? దిగుబడి అంతంతమాత్రంగా ఉంటే.. ఇప్పుడు గిట్టుబాటు ధరా లేదు. అటు వ్యాపారుల మోసాలు, ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యం కలగలిపి రైతులు నష్టపోతున్నారు. రాష్ట్ర రైతాంగం ఈ ప్రభుత్వాన్ని క్షమించదు అని మండిపడ్డారు. వేరుశనగ రైతుల ఆందోళనతో మహబూబ్ నగర్ జిల్లా అట్టుడుకుతోందని అన్నారు.
కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం మేల్కొని వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా మార్కెట్ యార్డుల్లో వ్యాపారులు, కమిషన్ దారుల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. పోలీసుల బందోబస్తు నడుమ వేరుశనగ కొనుగోలు జరపాల్సిన దుస్థితి రావడం దారుణమని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పాలిట రాబందుగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతాంగం క్షమించబోదని అన్నారు.
కాగా, నవాబ్‌పేట, గండీడ్, మహ్మదాబాద్, మహబూబ్‌నగర్ రూరల్ నుండి రైతులు వందల క్వింటాళ్ల పల్ల్లిని మార్కెట్‌కు తెచ్చారు. గరిష్ఠంగా క్వింటాకు 6,190, కనిష్ఠంగా రూ.3,300 ధర నిర్ణయించారు. వ్యాపారులు మాత్రం రూ.5,700 మాత్రమే ఇస్తామని చెప్పడంతో రైతులు కన్నెర్ర చేశారు. దీనికితోడు తక్కువ తూకంతో మోసానికి పాల్పడుతున్నారని, వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు అడుగుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఆందోళనకు దిగారు. దాదాపు 4 గంటలపాటు మార్కెట్ కార్యాలయాన్ని దిగ్బంధించారు. సమీపంలోని బోయపల్లి గేట్ వద్ద రైల్వే లైన్‌పై బైఠాయించారు.