ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ (MLC By polling) ప్రశాంతంగా ముగిసింది. గత ఆరు నెలలుగా తెలంగాణ లో వరుస ఎన్నికలు ..రాష్ట్రంలో సందడిగా మారాయి. నవంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగా..మొన్న పార్లమెంట్ , ఈరోజు ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. 4 గంటల వరకు క్యూ లైన్లో నిల్చున్న వారికీ ఓటు హక్కు కల్పించారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలింగ్ జరిగింది. జూన్ 5వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నిక బరిలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్), బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మొత్తంగా 52 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. శాసనసభ ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్ధిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో, 605 పోలింగ్ కేంద్రాల్లో ఉపఎన్నిక జరుగగా… అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118, అతితక్కువగా సిద్దిపేటలో 5 కేంద్రాల్లో పోలింగ్ సాగింది.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి హనుమకొండలో ఓటేయగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామలో, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి తొర్రూరులో , వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, నల్గొండలో కలెక్టర్ చందన, ఇతర అధికారులు ఓటు వేశారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, భువనగిరి జిల్లా తుర్కపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, వరంగల్ కాశీబుగ్గలోని వివేకానంద కళాశాలలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్ ఓటేశారు.
Read Also : Amit Shah : కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదు – అమిత్ షా