Miyapur Land scam : గులాబీ `తోట‌`లో భూ కుంభ‌కోణం ! బీజేపీ న‌యా ఫోక‌స్!

మియాపూర్ భూ కుంభ‌కోణం(Miyapur Land scam)మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌స్తోంది.

  • Written By:
  • Publish Date - January 17, 2023 / 02:39 PM IST

తెలంగాణ ప్ర‌భుత్వాన్ని 2017లో వ‌ణికించిన మియాపూర్ భూ కుంభ‌కోణం(Miyapur Land scam) వ్య‌వ‌హారం మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌స్తోంది. ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్ర‌శేఖ‌ర్ రావు కు 4వేల కోట్ల విలువైన ప్ర‌భుత్వ‌ భూముల‌ను కేసీఆర్ ధారాద‌త్తం చేశార‌ని బీజేపీ(BJP)ఎమ్మెల్యే ర‌ఘ‌నంద‌న్ రావు ఆరోపిస్తున్నారు. ఖ‌మ్మం స‌భ కు నిధుల‌ను ఆంధ్రా రియ‌ల్డ‌ర్లు, కాంట్రాక్ట‌ర్ల నుంచి స‌మీక‌రిస్తోన్న కేసీఆర్ కు ఇప్పుడు ఆంధ్రోళ్లు బంధువ‌ల‌య్యార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సివిల్ స‌ర్వెంట్ నుంచి రియల్డ‌ర్ గా మారిన తోట చంద్ర‌శేఖ‌ర్ మియాపూర్ కుంభ‌కోణంలో సూత్ర‌ధారిగా ర‌ఘ‌నంద‌న్ భావిస్తున్నారు. ఆయ‌న‌కు భూముల‌ను క‌ట్ట‌బెట్ట‌డంలో తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌, రంగారెడ్డి క‌లెక్ట‌ర్ అనుకూలంగా ఫైల్ మూవ్ చేశార‌ని బ‌య‌ట‌పెట్టారు. సుఖేశ్ గుప్తా మీద స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్ ను దాఖ‌లు చేసిన రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ వ్య‌వ‌హారాన్ని ప్ర‌శ్నిస్తూ తోట చంద్ర‌శేఖ‌ర్ మీద సుప్రీం కోర్టులో పిటిష‌న్ ఎందుకు వేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు.

మియాపూర్ భూ కుంభ‌కోణం(Miyapur Land scam)  

ఏపీలోని బీఆర్ఎస్ నేత‌లు ఎవ‌రు? ఖ‌మ్మం స‌భ‌కు నిధులు ఎక్క‌డ నుంచి వ‌స్తున్నాయి? అనే దానిపై బీజేపీ ఆరా తీస్తోంది. ఆ క్ర‌మంలో మియాపూర్ భూ కుంభ‌కోణంలో(Miyapur Land scam) సుమారు 4వేల కోట్ల రూపాయాల విలువైన భూముల‌ను పొందిన తోట చంద్ర‌శేఖ‌ర్ వ్య‌వ‌హారం ఫోక‌స్ అయింది. వేలాది ఎక‌రాల భూములు ప్రైవేటు వ్య‌క్తుల చేతుల్లోకి వెళ్లాయ‌ని ఆనాడు మియాపూర్ భూ కుంభ‌కోణం బ‌య‌ట‌కొచ్చిన‌ప్పుడు బ‌య‌ట‌ప‌డింది. కానీ, భూ కుంభ‌కోణం ఏమీ జ‌ర‌గ‌లేద‌ని సీఎం కేసీఆర్ ఆనాడు ప్ర‌కటించ‌డంతో దానిపై విచార‌ణ అట‌కెక్కింది. అప్ప‌ట్లో గోల్డ్‌ స్టోన్‌ కంపెనీ ఈ భూములను కేకే కుమార్తెకు అమ్మినట్లు న్యూస్ వ‌చ్చింది. ఆ భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అధికారి సస్పెండ్‌ అయిన విషయం తెలిసిందే.

Also Read : Land Scam in Jubilee Hills : జూబ్లీహిల్స్ లో రూ. 2,500 కోట్ల భూ కుంభ‌కోణం

టీఆర్ఎస్ నేత కేకే కుటుంబంపైనే ఆరోపణలు రావటంతో ఒక దశలో మియాపూర్ భూకుంభకోణం తెలంగాణ గవర్నమెంట్ మెడకు చుట్టుకున్నట్టే అంటూ అప్ప‌ట్లో వినిపించింది. కానీ క్ర‌మంగా నయీం కేసులో జరిగినట్టే మియాపూర్ భూ కుంభ‌కోణం విష‌యంలోనూ జరిగిపోతోంది. రాజకీయ నేతలు సేఫ్ జోన్ ను శాశ్వ‌తంగా చేరుకోగ‌లిగారు. ప్రభుత్వ భూముల్ని రిజిస్టర్ చేయించుకున్న ప్రైవేట్ పార్టీల నుంచి తిరిగి హక్కులన్నీ గవర్నమెంట్ పొందటం ఈజీ కాద‌ని ఆనాడు న్యాయ నిపుణులు కొంద‌రు ఇచ్చిన స‌ల‌హా. రిజిస్ట్రేషన్ లు చేయించుకున్న వారి డాక్యుమెంట్లు చెల్లవని ఒక నోటిఫికేషన్ ఇస్తే స‌రిపోద‌ని ఆనాడే చెప్పారు. ప్రభుత్వ భూములన్నీ భద్రంగా సర్కార్ ఆధీనంలోకి రావాలంటే బోలెడంత చట్టపరమైన తతంగం జరగాల‌ని సూచించారు. ఏమైందో ఏమోగానీ తొలి రోజుల్లో స్పీడుగా ముందుకు క‌దిలిన ఆ వ్య‌వ‌హారం క్ర‌మంగా భూస్థాపింతం అయింది.

కేకే కుటుంబంపైనే ఆరోపణలు రావటంతో….

వాస్త‌వంగా రిజిస్ట్రేషన్ శాఖలోని కొంద‌రు అధికారులు గవర్నమెంట్ భూముల్ని ఇష్టానుసారం ఎవరెవరికో కట్టబెట్టేశారు. వాటిని తిరిగి పొందాలంటే ముందుగా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ లోని సెక్షన్ 22 ప్ర‌కారం భూముల్ని నోటిఫై చేయాలి. ఆన్ లైన్లో ఆయా సర్వే నెంబర్లని మళ్లీ రిజిస్ట్రేషన్ అవ్వకుండా బ్లాక్ చేయాలి. సదరు భూముల్ని నోటిఫై చేసిన ప్రభుత్వం అభ్యంతరాలు వున్న వారు తమకు తెలుపవచ్చని కూడా నోటీస్ ఇవ్వాలి. ఇదంతా పూర్తైన తరువాత భూముల అక్రమ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తూ జీవో జారీ చేయాలి. కాని, ప్రభుత్వం అలా క్యాన్సిల్ చేస్తే రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మరో వైపు నిజాం, పయిగా వంశస్థులు సర్కార్ భూములు తమవంటూ, వారు కూడా కోర్టుకు వెళ్లే చట్టబద్ధమైన అవకశాలున్నాయి. ఇలా కోర్టులో లిటిగేషన్లు మొదలైతే మియాపూర్ భూముల వ్యవహారం తేలటానికి ఏళ్లు పడుతుంద‌ని టోట‌ల్ గా అట‌కెక్కించార‌ని న్యాయ నిపుణులు కొంద‌రు చెబుతున్న‌మాట‌.

Also Read :Metro Rail : మెట్రో విస్త‌ర‌ణ‌లో భారీ `భూ` స్కామ్‌! బినామీల‌పై బీజేపీ ఆగం!

ప్ర‌భుత్వంతో స‌హా అంద‌రూ మ‌రిచిపోయిన మియాపూర్ భూ కుంభ‌కోణం వ్య‌వ‌హారాన్ని 2017 త‌రువాత తిరిగి బీజేపీ(BJP) ఇప్పుడు బ‌య‌ట పెడుతోంది. ఇటీవ‌ల బీఆర్ఎస్ పార్టీలో చేరిన తోట చంద్ర‌శేఖ‌ర్ చుట్టూ ఆ విష‌యాన్ని ఫోక‌స్ చేస్తోంది. ఆయ‌న‌కు 4వేల కోట్ల రూపాయాల విలువైన భూముల‌ను కేసీఆర్ క‌ట్ట‌బెట్టార‌ని, ఖ‌మ్మం స‌భ‌కు నిధుల‌ను స‌మ‌కూర్చుతున్న రియ‌ల్డ‌ర్ కూడా ఆయ‌నే అంటూ ర‌ఘునంద‌న్ సంకేతాలు ఇస్తున్నారు. అంతేకాదు, దీని వెనుక చాలా మంది బ‌డా రాజ‌కీయ‌వేత్త‌లు ఉన్నార‌ని అప్ప‌ట్లో వినిపించిన మాట‌. వాళ్ల‌లో ఎక్కువ మంది గులాబీ పార్టీలోనే ఉన్నారు. అంటే, మియాపూర్ భూ కుంభ‌కోణం వ్య‌వ‌హారాన్ని బీజేపీ నికార్సుగా తేల్చుతుందా? అనే ఆశ సామాన్యుల్లో ఇప్పుడు మొద‌ల‌యింది.