మెదక్ జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 14న కనిపించకుండా పోయిన ప్రేమ జంట (Love Couple) అదృశ్యం విషాదాంతంగా ముగిసింది. గురువారం ఉదయం నార్సింగి చెరువులో నుంచి వాళ్ల మృతదేహాలను వెలికితీశారు. మెదక్ జిల్లా నార్సింగిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కల్పన, ఖలీల్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మతాలు వేరు కావటంతో కల్పన కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదు. 2 నెలల క్రితం కల్పనను వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసారు. దీనిని తట్టుకోలేక కల్పన, ఖలీల్ 4 రోజుల క్రితం పారిపోయారు.
Also Read: Road Accident: మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. 17 మందికి గాయాలు
పోలీసులు గాలిస్తుండగానే ఇద్దరి మృతదేహాలు నార్సింగి చెరువులో తేలాయి. ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న తమ కూతురు కనిపించడం లేదని కల్పన తల్లిదండ్రులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులకు నార్సింగి శివారులోని చెరువు వద్ద కల్పన, ఖలీల్ చెప్పులు, బైకులు కనిపించాయి. దీంతో వీళ్లిద్దరూ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావించారు. రెండు రోజులు చెరువులో గాలించగా గురువారం ఉదయం ప్రేమికుల మృతదేహాలు లభించాయి.