Milla Magee : ‘మిస్ ఇంగ్లండ్ 2025’ మిల్లా మాగీ సంచలన ఆరోపణలు చేసి, హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీల నుంచి నిష్క్రమించారు. ఇప్పుడు అంతటా ఆమె చేసిన ఆరోపణలపైనే చర్చ జరుగుతోంది. ఈ అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ విచారణ కమిటీలో అందరూ మహిళా అధికారులే ఉంటారు. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్, ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీలతో కూడిన కమిటీ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయనుంది. మిల్లా మాగీ చేసిన ఆరోపణలను నిశితంగా విశ్లేషించి, విచారణ జరపనున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ప్రధానంగా ‘‘నన్ను నేను ఒక వేశ్య అనుకునేలా చేశారు’’ అని మిల్లా మాగీ చేసిన ఆరోపణలను కమిటీ ప్రత్యేకంగా పరిశీలించనుంది.
Also Read :Kavitha Politics : కవిత విమర్శలపై కేటీఆర్‌కు కేసీఆర్ ఏం చెప్పారంటే..
తెలంగాణ ప్రభుత్వ విచారణ కమిటీ.. ఏం చేయనుంది ?
- మిల్లా మాగీ(Milla Magee) తెలంగాణకు వచ్చినప్పటి నుంచి ఎక్కడెక్కడ పర్యటించారు ? ఎవరెవరిని కలిశారు ? అనే సమాచారాన్ని సేకరించనున్నారు. ఆయా కార్యక్రమాల వీడియో ఫుటేజీలను కూడా సేకరించి పరిశీలించనున్నారు.
- మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ ఆదేశాలు, మిల్లా మాగీతో ఉన్న ఇతర పోటీదారుల వ్యవహార శైలిని కూడా కమిటీ విచారించనుంది.
- తెలంగాణలో ఉన్న సమయంలో మిల్లా మాగీ పాల్గొన్న డిన్నర్‌లలో ఎవరెవరు పాల్గొన్నారు? అనే దానిపైనా ఆరా తీయనున్నారు.
- ఈ పోటీలకు స్పాన్సర్ చేసిన ధనవంతులు ఎవరు? వారి ప్రవర్తన ఎలా ఉంది ? అనేది కూడా తెలుసుకోనున్నారు. ఈక్రమంలో ఆయా ఈవెంట్లు జరిగిన ప్రదేశాల వీడియో ఫుటేజీలు కీలకంగా మారనున్నాయి.
- పోటీల నిర్వహణ క్రమంలో మహిళల భద్రత, రక్షణ, ఆత్మగౌరవం కాపాడేందుకు తీసుకున్న చర్యలు ఏమిటి? అనేది కూడా తెలుసుకోనున్నారు.
Also Read :Cabinet Expansion: టీపీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ దిశగా కదలిక.. నేడు కీలక భేటీ
‘‘నన్ను నేను వేశ్య అనుకునేలా చేశారు’’.. మిల్లా మాగీ వ్యాఖ్యలివీ
‘‘ఒక మార్పు చూపిద్దామని నేను హైదరాబాద్‌కు వెళ్లాను. కానీ, ఏదో ఆటబొమ్మలా కూర్చోవాల్సి వచ్చింది. అక్కడ కొనసాగడానికి నా నైతికత ఒప్పుకోలేదు. ఏదో వినోదం పండించడానికే వచ్చినట్టు నన్ను నిర్వాహకులు చూశారు. నన్ను నేను ఒక వేశ్య అనుకునేలా చేశారు. ధనవంతులైన మగ స్పాన్సర్ల ముందు నన్ను నడిపించిన తరువాత, ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాను. ఆరుగురు అతిథులు కూర్చున్న ప్రతీ టేబుల్ మీద ఇద్దరు అమ్మాయిలను కూర్చోబెట్టారు. సాయంత్రమంతా వారితో కూర్చొని, ఎంటర్‌టైన్ చేయాలన్నారు. నాకు అది చాలా తప్పుగా అనిపించింది. నేను జనానికి వినోదాన్ని పంచడానికి వెళ్లలేదు. మిస్ వరల్డ్ పోటీలకు కొన్ని విలువలు ఉండాలి. కానీ, ఆ పోటీలు చాలా పాతకాలం పద్ధతుల దగ్గరే ఆగిపోయాయి. ఔట్ డేటెడ్ అవి. నన్ను నేను ఒక వేశ్యలా భావించుకునేలా చేశాయి’’ అని మిల్లా మాగీ ‘ది సన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
మిస్ వరల్డ్ సంస్థ ఛైర్మన్ ఏం చెప్పారో తెలుసా ?
‘‘మిల్లా మాగీ ఇండియాలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకు, బ్రిటన్‌కు తిరిగి వెళ్లాక చేస్తున్న ఆరోపణలకు అసలు సంబంధమే లేదు. ఆ అమ్మాయి హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మాట్లాడిన అన్ ఎడిటెడ్ వీడియోలను మేం విడుదల చేశాం. తన తల్లి అనారోగ్యంతో ఉందని చెప్పి మిల్లా మాగీ అకస్మాత్తుగా వెళ్లిపోయింది. దీంతో ఆమె స్థానంలో చార్లెట్ గ్రాంట్‌ను పిలిపించాం’’ అని మిస్ వరల్డ్ సంస్థ ఛైర్మన్, సీఈవో జూలియా మోర్లీ స్పష్టం చేశారు.