Jana Reddy Vs Rajagopal Reddy: రాష్ట్ర మంత్రి పదవిని ఆశిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి లాంటి నేతలు ధృతరాష్ట్రుడి పాత్రను పోషిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను అడుక్కునే స్థితిలో ఎప్పుడూ ఉండనని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదన్నారు. జానారెడ్డి 30 ఏళ్ల పాటు మంత్రి పదవి అనుభవించిన విషయాన్ని గుర్తు చేశారు. రంగారెడ్డి, హైదరాబాద్‌కు కూడా మంత్రి పదవిని కేటాయించాలనే విషయం.. ఇంత ఆలస్యంగా గుర్తుకు వచ్చిందా అని జానారెడ్డిని ఈసందర్భంగా రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. కొందరు రాజకీయాలు చేసి మరీ తనకు మంత్రి పదవి రాకుండా చేస్తుండటం బాధ కలిగిస్తోందన్నారు. మంతి పదవి ఇస్తానని స్వయంగా పార్టీయే తనకు హామీ ఇచ్చిందన్నారు. ఇంతకీ జానారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి మధ్య ఏం జరుగుతోంది ?
చతురతతో ఇద్దరు కుమారులు సెటిల్
కుందూరు జానారెడ్డి.. కాంగ్రెస్‌లో సీనియర్ నేత. టీడీపీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన జానారెడ్డి(Jana Reddy Vs Rajagopal Reddy).. 1988లో నేరుగా ఎన్‌టీ రామారావుతో విభేదించారు. 30 మంది రాష్ట్ర క్యాబినెట్ మంత్రులను ఒకేసారి ఎన్‌టీఆర్ మార్చడం జానారెడ్డికి నచ్చలేదు. దీంతో ఆయన టీడీపీని వదిలేసి కాంగ్రెస్‌లో చేరిపోయారు. నాటి నుంచి నేటి వరకు జానారెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్నారు. తెలుగురాష్ట్రాల్లో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన నేత కూడా జానారెడ్డే. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ సలహా దారుడిగా తెలంగాణ ప్రభుత్వంలో కీలక పాత్రను ఆయన పోషిస్తున్నారు. జానారెడ్డి కుమారుల్లో ఒకరైన కుందూరు రఘువీరారెడ్డి ప్రస్తుతం నల్గొండ ఎంపీగా ఉన్నారు. మరో కొడుకు జయవీర్‌రెడ్డి నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తన ఇద్దరు కుమారుల్ని రాజకీయాల్లో సెటిల్ చేయడాన్ని బట్టి జానారెడ్డి రాజకీయ చతురతను మనం అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే తన శిష్యుడు శంకర్ నాయక్‌ను అనూహ్యంగా తెరపైకి తెచ్చి ఎమ్మెల్సీగా చేశారు జానారెడ్డి.
హైకమాండ్‌కు జానా లేఖ.. రాజగోపాల్ రెడ్డి ఫైర్
కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర జానారెడ్డికి మంచి పలుకుబడి ఉంది. ఆయన ఇటీవలే హైకమాండ్‌కు ఒక లేఖ రాశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గేలకు లెటర్లు పంపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన జానారెడ్డి.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవి కోసం గళం వినిపించడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఆలోచింపజేసింది. ఈ లేఖ వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మంత్రి పదవిని ఆశిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నష్టం జరుగుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అందుకే ఇవాళ జానారెడ్డి లక్ష్యంగా రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారు. మూడో బెర్త్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దక్కుతుందని భావిస్తున్న తరుణంలో.. జానారెడ్డి లేఖతో లెక్కలు మారిపోయాయి.
Also Read :Yusuf Vs BJP : టీ తాగిన యూసుఫ్ పఠాన్ .. బీజేపీ భగ్గు
ఆంతర్యం ఇదేనా ?
ప్రస్తుతం రెడ్డి వర్గం నుంచి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి(నిజామాబాద్ జిల్లా), రాజగోపాల్ రెడ్డి (నల్గొండ జిల్లా) మంత్రి పదవిని ఆశిస్తున్నారు. జానారెడ్డి హైకమాండ్‌కు రాసిన లేఖ ప్రభావంతో రాజగోపాల్ రెడ్డి వెనుకంజలో ఉండిపోయారని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిణామంతో సీఎం రేవంత్‌కు సన్నిహితుడైన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కడం ఖాయమని అంచనా వేస్తున్నారు.