Minister Sridhar Babu: అసెంబ్లీ సమావేశాలపై అధికారులతో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రధాన గేట్ల వద్ద ఉండే పోలీసు సిబ్బంది కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులను గుర్తించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై అటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.
సోమవారం నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్బంగా స్పీకర్ ప్రసాద్ కుమార్, కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తో కలిసి ఆయన పోలీసు, పౌర అధికారులతో ఏర్పాట్ల గురించి సమీక్ష జరిపారు. సమావేశాల సందర్భంగా అసెంబ్లీ పరిసరాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు. తనిఖీలు చేపట్టి సమావేశ మందిరంలోకి నిషేధిత వస్తువులను సభలోకి తీసుకురాకుండా చూడాలని ఆదేశించారు. ఛైర్మన్, స్పీకర్ ల పర్యటనల్లో ప్రోటోకాల్ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలని ఆదేశించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని గౌరవ, మర్యాదలతో చూడాల్సిన బాధ్యతను మర్చిపోరాదని అన్నారు.
Also Read: Team India: అడిలైడ్ టెస్టులో ఓడిపోయిన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడగలదా?
సభ్యులు అడిగిన రాతపూర్వక ప్రశ్నలకు వివిధ శాఖల నుంచి నిర్దేశించిన గడువులోగా సమాధానాలు వచ్చే విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీలు చూడాలని కోరారు. వేర్వురుగా జరిగిన సమీక్షా సమావేశాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, డిజిపి డా. జితేందర్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్, శాంతి భద్రతల అదనపు డిజిపి మహేశ్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డిజి నాగిరెడ్డి, సైబరాబాద్ సిపి అవినాశ్ మహంతి, రాచకొండ సిపి సుధీర్ బాబు, ఇంటెలిజెన్స్ ఐజిపి కార్తికేయ, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ తఫ్సీర్ ఇక్బాల్, ఎస్.బి డిసిపి చైతన్య కుమార్, ఎస్పిఎఫ్ కమాండెంట్ పి.ఎస్. రావు, తదితరులు పాల్గొన్నారు.