Minister Ponnam: సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రజల సౌకర్యార్థం 6432 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) తెలిపారు. అయితే పండగకు కేటాయించిన ప్రత్యేక బస్సులను నేటి నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకొచ్చనట్లు మంత్రి తెలిపారు. ఇప్పుడు నడుపుతున్న 6432 ప్రత్యేక బస్సులు సరిపోకుంటే ప్రయాణీకుల అవసరాల దృష్ట్యా మరిన్ని ఆర్టీసీ బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. అయితే ప్రతి ముఖ్యమైన బస్టాండ్ వద్ద ఆర్టీసీ అధికారులు ప్రయాణీకులకు అందుబాటులో ఉండాలని, ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు వహించాలని మంత్రి ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా బస్సుల్లో అదనంగా మహిళలు వచ్చా అవకాశం ఉందని అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఎక్కడ ఇబ్బందులు కలిగించవద్దని అధికారులను ఆదేశించారు.
మరోవైపు.. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సంక్రాంతి పండగను అదునుగా భావించి ప్రయాణికులను అదనపు చార్జీల పేరుతో దోపిడికి గురి చేస్తే అట్టి ప్రైవేట్ ట్రావెల్స్‌పై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న చార్జీలనే వసూలు చేయాలని అదనంగా వసూలు చేస్తే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్ చేస్తామని మంత్రి హెచ్చరించారు.
Also Read: Housing Scheme: ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారా? కేంద్రం నుంచి రూ. 2.50 లక్షలు పొందండిలా!
ఒకవేళ నిబంధనలు అతిక్రమించి ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణీకులను ఇబ్బంది పెట్టినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టానుసారంగా టికెట్లపై డబ్బు వసూలు చేస్తే ప్రయాణీకులు వెంటనే ఆర్టీసీ లేదా రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. అదేవిధంగా ఈ వారం రోజులు ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు ఫీల్డ్‌లోనే ఉండి ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని అన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయాణీకుల సంక్షేమానికి, భద్రతకి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రయాణీకులు గమ్యస్థానాలకు సురక్షితంగా వెళ్లాలని కోరారు. రాకపోకలకు ఎక్కువ శాతం ఆర్టీసీ బస్సులనే ఉపయోగించాలని మంత్రి ప్రయాణీకులను కోరారు.