తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఇటీవల వరుసగా వివాదాల్లో (Controversy) చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ఆమె బంధువుతో జరిగిన అసభ్య ఫోన్ సంభాషణలు, సమంత-కేటీఆర్ ఇష్యూలో చేసిన వ్యాఖ్యలు, అలాగే పబ్లిక్ ప్లాట్‌ఫారంపై తన మేనల్లుడికి ఉద్యోగం ఇప్పించాలంటూ మంత్రి శ్రీధర్‌బాబును కోరడం వంటి అంశాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు పలుమార్లు పార్టీకి, ప్రభుత్వానికి అసౌకర్యాన్ని కలిగించాయనేది విశ్లేషకుల అభిప్రాయం.
Musi Riverfront : ‘మూసీ రివర్ ఫ్రంట్’కు అప్పుల బాటలో అడ్డంకులు.. కేంద్రం కొర్రీలు
తాజాగా ఆమె చేసిన మరో సంచలన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. మంత్రులంతా (Ministers ) ఫైళ్ల క్లియరెన్స్‌కి డబ్బులు తీసుకుంటారని కానీ తాను మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోనని ఆమె చేసిన వ్యాఖ్యలు విపక్షాలతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్రంగా విమర్శలకు గురయ్యాయి. ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తేలా తయారయ్యాయి. ఆమె నిజాయితీ చూపించాలనే ఉద్దేశంతో అన్నారు కాబోలు అన్నదానికన్నా, మిగతా మంత్రులపై ఆరోపణలు చేసినట్టే తలపించేలా ఉన్నాయని విమర్శకుల వాదన.
ఈ వ్యాఖ్యలతో కొండా సురేఖపై నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. “మీరు ఎంత నిజాయితీగా ఉన్నా, మిగిలినవారిని ఆరోపించడం బాధ్యతారాహిత్యమే” అంటూ ఆమెపై మండిపడుతున్నారు. పలు వర్గాల నుంచి ఆమె రాజీనామా చేయాలని డిమాండ్లు వస్తున్నా, మంత్రి మాత్రం ఇంకా స్పందించలేదు. పార్టీ అధిష్టానం కూడా ఆమె వ్యాఖ్యలను గమనించిందని, తగిన చర్యలపై ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.