Minister Strong Warning: ఇంటర్ కాలేజీల్లో విద్యార్ధుల మరణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ (Minister Strong Warning) అయ్యారు. పది రోజుల్లో ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవడం దారుణమని అన్నారు. ర్యాంకుల పేరిట విద్యార్ధులను మానసిక ఒత్తిడికి గురిచేసే విధానాలను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మానుకోవాలని సూచించారు. విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్న కాలేజీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. విద్యార్ధులు అధైర్యపడి క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకొని తల్లితండ్రులకు గర్భశోకం మిగిల్చవద్దని మంత్రి స్టూడెంట్స్‌ని ఉద్దేశించారు తెలిపారు. ఇంటర్ విద్యార్ధులకు ఏదైనా అత్యవసర సమస్య ఉంటే ఆఫీసు మొబైల్ నెంబర్ ను 8688007954 లేదా minister.randbc@gmail.com ఈమెయిల్ కు తెలియజేయండని ఆయన మొబైల్ నంబర్, మెయిల్ ఇచ్చారు. చావు సమస్యకు అంతిమ పరిష్కారం కాదు.. బ్రతికి సాధించాలని విద్యార్ధులకు మంత్రి పిలుపునిచ్చారు.
ప్రైవేట్ కాలేజీల్లో యాజమాన్యాల నిర్వాహణ నిర్లక్ష్యం, పిల్లలపై ర్యాంకుల కోసం చేసే అనవసరమైన ఒత్తిడి కారణంగా ఇంటర్ విద్యార్ధులు చనిపోవడం బాధాకరమని ట్వీట్‌లో తెలిపారు. మొన్న నారాయణ కాలేజీకి చెందిన బానోత్ తనూష్ నాయక్, నిన్న శ్రీచైతన్య జూనియర్ కాలేజీ విద్యార్ధి కౌషిక్ రాఘవ, ఈరోజు ప్రగతినగర్ లోని ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కాలేజీ విద్యార్ధిని ప్రగ్నారెడ్డి మృతి బాధాకరమన్నారు.
Also Read: BR Naidu : భక్తుల దగ్గరికి వెళ్లి సమస్యలడిగి తెలుసుకున్న TTD ఛైర్మన్ బిఆర్ నాయుడు
బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలు అర్ధాంతరంగా చనిపోవడం మనసును కలిచివేస్తుందని, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్ధుల పట్ల మానవతా ధృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. వారి మానసిక స్థాయికి తగ్గట్టుగా బోధించి వారిని ప్రతిభావంతులను చేయాలి తప్పితే.. బలవంతంగా సిలబస్ ను రుద్ది వారి జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు విధానాలు అనుసరించే కాలేజీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందనే విషయం కళాశాలల యాజమాన్యాలు గుర్తించి వ్యవహరించాలన్నారు. కార్పోరేట్ కాలేజీల్లో చదివే విద్యార్ధులకు ఏదైనా ఇబ్బంది ఉంటే.. మా కార్యాలయం దృష్టికి తీసుకురండి.. మేం మీకు అండగా ఉంటాం. మీ ఇబ్బందులను పరిష్కరిస్తాం. మీ కోసం ఉజ్వలమైన భవిష్యత్తు ఎదురుచూస్తుందని తెలిపారు.