Site icon HashtagU Telugu

Minister Harish : లోక్ స‌భ‌తో ఏపీ,తెలంగాణ ఎన్నిక‌లు ?

Minister Harish

Minister Harish

`ఆడా ఈడ ఎందుకు ఈడ‌నే ఓటు న‌మోదు చేసుకోండి` ఏపీ సెటిల‌ర్ల‌కు మంత్రి హ‌రీశ్ (Minister Harish) ఇచ్చిన దిశానిర్దేశం. ఇదేదో అనాలోచితంగా ఇచ్చిన పిలుపు కాదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు  ఒకేసారి ఎన్నిక‌లు(Elections) వ‌స్తాయ‌ని సంకేతాలు ఇచ్చే మాట అది. రెండు రాష్ట్రాల‌కు ఒకేసారి ఎన్నిక‌లు వ‌స్తే, ఏపీ సెటిల‌ర్ల‌ను తెలంగాణ‌లోనే ఆపే ప్ర‌య‌త్నం మొద‌ల‌యింది. ఎందుకంటే, బీఆర్ఎస్ వైపు ఏపీ సెటిల‌ర్లు ఉన్నార‌ని గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాలు చెబుతున్నాయి. అందుకే, మూడోసారి గెలుపు కోసం బీఆర్ఎస్ మాస్ట‌ర్ ప్లాన్ వేస్తూ ఏపీ సెటిల‌ర్లను తెలంగాణ‌లోనే ఓట్ల న‌మోదు వైపు మ‌ళ్లిస్తోంది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు  ఒకేసారి ఎన్నిక‌లు(Minister Harish)

ముంద‌స్తు ఎన్నిక‌ల‌ వ‌స్తాయ‌ని ఇటీవ‌ల వ‌ర‌కు తెలంగాణ వ్యాప్తంగా ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌రువాత తెలంగాణ‌తో పాటు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా ముందస్తుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ లేసింది. అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా ప‌లుమార్లు ఢిల్లీ వెళ్లార‌ని టాక్ ఉండేది. కానీ, ఇటీవ‌ల ఆయ‌న ఢిల్లీ వెళ్లొచ్చిన త‌రువాత ఏపీ, తెలంగాణ‌కు ఒకేసారి ఎన్నిక‌లు(Elections) వ‌స్తాయ‌ని తెలుస్తోంది. అయితే, ముంద‌స్తు మాట ఉండ‌ద‌ని స‌మాచారం. అదెలా అంటే, తెలంగాణ ప్ర‌భుత్వానికి డిసెంబ‌ర్ నాటికి గ‌డువు ముగుస్తుంది. ఆ లోపు ఎన్నిక‌ల‌కు పెట్టాలి. కానీ, మ‌రో ఆరు నెల‌లు పొడిగిస్తార‌ని తెలుస్తోంది. రాష్ట్ర‌ప‌తి పాల‌న లేదంటే, అప‌ద్ధ‌ర్మ సీఎంగా కేసీఆర్ ను కొన‌సాగిస్తూ మ‌రో ఆరు నెల‌లు పొడిగించే అధికారం ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ఉంది. అదే జ‌రిగితే, వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెల‌లో తెలంగాణ ఎన్నిక‌ల‌కు ఉండే అవ‌కాశం ఉంది.

సాధార‌ణ ఎన్నిక‌ల‌తో  తెలంగాణ ఎన్నిక‌ల‌ ప్లాన్

ఏపీ ప్ర‌భుత్వానికి వ‌చ్చే ఏడాది మే వ‌ర‌కు గ‌డువు ఉంది. ఆ లోపు ఎన్నిక‌ల‌ను షెడ్యూల్ లోపు జ‌రుపుతారు. అదే టైమ్ లోక్ స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ కూడా. అంటే, సాధార‌ణ ఎన్నిక‌ల‌తో పాటు ఏపీ రాష్ట్ర ఎన్నిక‌లు ఎప్ప‌టి మాదిరిగా ఉంటాయి. కానీ, తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌లు మాత్రం సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు గడువులోగా ఉండాల‌ని కేసీఆర్ కోరుకుంటున్నారు. అయితే, ప్ర‌స్తుతం కేంద్రం, రాష్ట్ర మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. మునుప‌టి మాదిరిగా కేసీఆర్ అనుకున్న‌ట్టు ఢిల్లీ బీజేపీ అగ్ర‌నేత‌లు న‌డిచే ప‌రిస్థితి లేదు. అందుకే, సాధార‌ణ ఎన్నిక‌ల‌తో పాటు తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల‌ను ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

ఏపీ సెటిల‌ర్లు తెలంగాణ లో ఓట‌ర్లుగా చేరాల‌ని పిలుపు

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం ద్వారా కేసీఆర్ 2018 ఎన్నిక‌ల్లో లాభ‌ప‌డ్డారు. రెండోసారి అధికారంలోకి రాగ‌లిగారు. అసెంబ్లీకి జరిగిన ఆరు నెల‌ల త‌రువాత జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ 2019లో ఢీలా ప‌డింది. అంటే, రాష్ట్రానికి, కేంద్రానికి వేర్వేరుగా ఎన్నిక‌ల‌కు జ‌రగ‌డం కార‌ణంగా కేసీఆర్ లాభ‌ప‌డ్డారు. అదే, ఒకేసారి జ‌రిగితే, బీజేపీకి లాభం. అందుకే, ఈసారి ఒకేసారి ఎన్నిక‌ల‌కు నిర్వ‌హించేలా ఢిల్లీ బీజేపీ అగ్ర‌నేత‌లు ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఆ విష‌యాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్(Minister Harish) ముందుగా గెలుపు వ్యూహాల‌ను మార్చుకుంటోంది.

Also Read : BRS Meeting: బీఆర్ఎస్ ఆత్మీయ సభలో విషాదం…

గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ఏపీ సెటిల‌ర్లు ఉన్న చోట ఎక్కువ‌గా బీఆర్ఎస్ కార్పొరేట‌ర్లు గెలిచారు. అదే, నార్త్ సెటిల‌ర్లు ఉన్న చోట టీఆర్ఎస్ బోల్తా కొట్టింది. ఆ అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని ఏపీ సెటిల‌ర్ల‌ను బీఆర్ఎస్ సానుకూలంగా మ‌లుచుకుంటోంది. ఆ దిశ‌గా అడుగులు వేస్తూ విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణకు వ్య‌తిరేకంగా మంత్రి కేటీఆర్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, కేసీఆర్ స‌ర్కార్ విశాఖ ఉక్కు బిడ్డింగ్ లోనూ పాల్గొనాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది. దీంతో ఏపీ ప్ర‌జ‌లు సానుకూలంగా బీఆర్ఎస్ ను చూస్తార‌ని ఆ పార్టీ భావ‌న‌. అదే స‌మ‌యంలో మంత్రి హ‌రీశ్ (Minister Harish)ఏపీ సెటిల‌ర్లు తెలంగాణ లో ఓట‌ర్లుగా చేరాల‌ని పిలుపు నిచ్చారు. అంటే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్, బీఆర్ఎస్ భ‌విష్య‌త్ ఏపీ సెటిల‌ర్ల మీద ఆధార‌ప‌డి ఉంద‌న్న‌మాట‌. నార్త్ సెటిల‌ర్లు ఉండే ప్రాంతాల్లో బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోతుంద‌ని స‌ర్వేల సారాంశం. అందుకే, బీఆర్ఎస్ ఈసారి ఎన్నిక‌ల‌కు వ్యూహాల‌ను మార్చుతూ ఇప్ప‌టి నుంచి సిద్ధ‌మ‌వుతోంది.

Also Read : BRS: ప్రజల సొమ్ముతో రిచెస్ట్ పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్