Midday Meal Scheme : మధ్యాహ్న భోజన పథకం.. అనగానే మనకు తెలంగాణలోని స్కూళ్లు గుర్తుకు వస్తాయి. అయితే ఈ గొప్ప పథకాన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై సీఎం రేవంత్ నుంచి ఆర్డర్స్ అందడంతో ఇంటర్ విద్యాశాఖ ప్రపోజల్స్ రెడీ చేస్తోంది. ఈ ప్రతిపాదనలను వారం రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పిస్తామని ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. సర్కారు ఆమోదముద్ర వేస్తే.. రాబోయే రాష్ట్ర బడ్జెట్‌లో ఈ పథకానికి నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది. వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి కాలేజీల్లో మిడ్ డే మీల్స్ స్కీంను అమలు చేస్తారు. ఒక్కో విద్యార్థిపై పూటకు రూ.20 నుంచి రూ.25 వరకు ఖర్చు చేయనున్నారు. ఇందుకోసం ఏటా రూ.120 కోట్ల వరకు ఖర్చవుతుంది.
Also Read :IT Raids : దిల్‌రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల తనిఖీలు
ఇదీ కారణం ?
తెలంగాణలో 425 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో దాదాపు 1.70 లక్షల మంది చదువుతున్నారు. ఈ కాలేజీలన్నీ నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లోనే ఉన్నాయి. దీంతో చాలామంది విద్యార్థులు రోజూ దూరప్రాంతాల నుంచి కాలేజీకి వచ్చి వెళ్తున్నారు. ఈ విద్యార్థుల్లో ఎక్కువ మంది పేదలే. వాళ్లు ఉదయాన్నే ఇంటి నుంచి భోజనాన్ని(Midday Meal Scheme) తెచ్చుకోలేరు. అందువల్ల మధ్యాహ్నం వరకు క్లాసులు విని, ఆ తర్వాత ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీనివల్ల ఆయా కాలేజీల పరీక్షా ఫలితాలు తగ్గుతున్నాయి. ప్రైవేటు కాలేజీల విద్యార్థులతో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు పోటీపడలేక పోతున్నారు. రోజూ మధ్యాహ్నం జరిగే తరగతులు మిస్ కావడంతో.. వార్షిక పరీక్షలు వచ్చే సరికి విద్యార్థులు ప్రిపరేషన్‌లో ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను అర్థం చేసుకున్న రాష్ట్ర సర్కారు వారికి మధ్యాహ్న భోజన వసతిని కల్పించాలని యోచిస్తోంది. దీనివల్ల గవర్నమెంటు జూనియర్ కాలేజీల్లో హాజరు కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
Also Read :Antibiotics : గుండె జబ్బులకు యాంటీబయాటిక్స్ సరైనవేనా, డాక్టర్లు చెప్పేది తెలుసుకోండి
ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, బీఈడీ, డీఈడీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో కూడా మొత్తం 3.91 లక్షల మందికి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని 2018లో బీఆర్ఎస్ సర్కారు నిర్ణయించింది. అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా ఈ స్కీంను అమలు చేయించాలని యోచించింది. 2020-21 విద్యా సంవత్సరంలో అమలు చేయాలని 2020 జులై 17న నాటి సీఎం కేసీఆర్ ఆదేశించినా, అది జరగలేదు.