Metro: హైదరాబాద్ లో మెట్రో సర్వీసులు బంద్!

సికింద్రాబాద్ లో చోటుచేసుకున్న విధ్వంసకాండ ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా కనిపిస్తోంది.

  • Written By:
  • Updated On - June 17, 2022 / 03:07 PM IST

సికింద్రాబాద్ లో చోటుచేసుకున్న విధ్వంసకాండ ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే 200 రైళ్లను రద్దు చేశారు. దీంతోపాటు పరిస్థితులు అదుపులోకి వచ్చేంతవరకు ఇబ్బంది లేకుండా ఉండేలా.. ఎక్కడికక్కడ రైళ్లను ఆపేశారు. కొన్నింటిని దారి మళ్లించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రైల్వేస్టేషన్లలో భద్రతను పెంచారు. అదనపు బలగాలను మోహరించారు. హైదరాబాద్ లోని మెట్రో రైలు సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు.

అగ్నిపథ్ వద్దంటూ ఆందోళనకారులు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసనకు దిగారు. అవి కాస్తా హింసకు దారితీయడంతో మెట్రో రైళ్లను ఆపేశారు. మెట్రోలో ప్రయాణించడానికి ఎవరూ మెట్రో స్టేషన్లకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లోని అన్ని మార్గాల్లోనూ మెట్రో సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. రేపటి (18-06-2022) నుంచి సర్వీసులు ఉంటాయని అధికారులు తెలిపారు. కానీ మెట్రోలో మియాపూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులను ఎర్రగడ్డ స్టేషన్ వద్ద అధికారులు దింపేయడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్జంట్ పనుల మీద వెళుతున్న తమను అకస్మాత్తుగా ఆపేస్తే.. ఎలా అని ఆందోళన చెందారు. కొద్దిసేపు ఆ స్టేషన్ లో గందరగోళ పరిస్థితి నెలకొంది. అటు ఢిల్లీలోనూ మెట్రో సర్వీసులను ఆపేశారు. హైదరాబాద్ లోని సబ్ అర్బన్ సర్వీసులు కూడా రద్దయ్యాయి. ఎంఎంటీఎస్ రైళ్ల సేవలను అధికారులు క్యాన్సిల్ చేశారు. అటు నాంప్లలి రైల్వేస్టేషన్ ను మూసేశారు. తిరుపతితోపాటు మరిన్ని రైల్వే స్టేషన్లలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.