తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ, విదర్భ వరకు ఒక ద్రోణి.. ఉత్తర కోస్తాంధ్ర నుంచి మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వరకు మరో ద్రోణి విస్తరించి ఉన్నాయి. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గాలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా వాతావరణ కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచించారు.
ఇక ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతలలో 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ములుగు జిల్లా ఏటూరునాగారంలో 7.3 సెం.మీ, సంగారెడ్డి జిల్లా మొగ్ధంపల్లిలో 5.7 సెం.మీ, ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరంలో 5.2 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీసలో 5.1 సెం.మీ చొప్పున భారీ వర్షాలు నమోదయ్యాయి. నేడు కూడా భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.
